మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..

మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది.. ఇటీవల ఆమె చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి.. తాజాగా వైసీపీ బహిష్కృత కార్యకర్త శృంగారపాటి సందీప్‌ ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.. ఎమ్మెల్యే శ్రీదేవి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సందీప్‌ సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పు ఇప్పిస్తే తిరిగి ఇవ్వకుండా తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.. అజ్ఞాతంలోకి వెళ్లిన శృంగారపాటి సందీప్‌ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

చలివేంద్రం సురేష్‌తో కలిసి శృంగారపాటి సందీప్‌ రెండ్రోజుల క్రితం ప్రెస్‌మీట్‌ పెట్టారు.. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్‌తోపాటు, ఎమ్మెల్యే శ్రీదేవిపైనా తీవ్ర ఆరోపణలు చేశారు.. ఈ ఆరోపణలతో ఎమ్మెల్యే శ్రీదేవి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు.. సందీప్‌, సురేష్‌ వ్యక్తుల నుంచి తనకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేశారు. సందీప్‌, సురేష్‌ ఇటీవలే వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. ఆ కక్షతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్‌, సురేష్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు.

నిజానికి సందీప్‌, సురేష్‌ ఇద్దరూ గతంలో ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. అయితే అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వీరిద్దరూ గతంలో కోర్టుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ కేసులు వెనక్కు తీసుకోవాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని సందీప్‌, సురేష్‌ ఆరోపిస్తున్నారు.. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్‌ టీడీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి వివరించిన ఈ బహిష్కృత కార్యకర్తలు.. కొంతమంది టీడీపీ నేతలతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పోలీసులను ఆశ్రయించడంతో వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.. తాజాగా సందీప్‌ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వివరించాడు. సీఐ ధర్మేంద్ర, ఎమ్మెల్యే శ్రీదేవి వేధిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.. తాడికొండ నియోజకవర్గంలో తమకు ప్రాణహాని ఉందంటూ సందీప్‌, సురేష్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. తమను కాపాడాలంటూ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story