TDP : టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
![TDP : టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి TDP : టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి](https://www.tv5news.in/h-upload/2023/12/15/1139709-ysrcp-mlas-joins-tdp-1vjpg-816x480-4g.webp)
వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో..మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా...పసుపు కండువా కప్పుకున్నారు.పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని వ్యాఖ్యానించారు. చిల్లు పడిన వైకాపా నావ త్వరలోనే మునిగిపోతుందన్న ఆయన 3నెలల తర్వాత జగన్ ఎక్కడికి వెళతారో కూడా తెలీదన్నారు. ఏపీపైకి అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారని దుయ్యబట్టారు.
వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధా కృష్ణయ్యతో పాటు 6 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైకాపా ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. నేతల చేరికలతో తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడేందుకే తెలుగుదేశం-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయని చెప్పిన చంద్రబాబు జగన్ ఎంత మందిని మార్చినా వైకాపాను ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని తెలిపారు.యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, గంజాయి మాత్రం ఇస్తున్నారని దుయ్యబట్టారు. జగన్.. 2004లో సీఎం కాకపోవడం వల్ల హైదరాబాద్ బతికిపోయిందని తెలిపారు. వికృత క్రీడలతో ఆంధ్రాని జగన్ అడిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజాసమస్యలపై పోరాడేందుకు శాఖలవారీగా 18 కమిటీలను చంద్రబాబు నియమించారు. ఒక్కో కమిటీని ఒక సీనియర్ నేత పర్యవేక్షించేలా బాధ్యత అప్పగించారు. 15రోజులకోసారి సమీక్షించుకుని తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com