ఒకే డోర్ నెంబర్లో వందకు పైగా ఓట్లు

ఏలూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి. ఒకే డోర్ నెంబర్లో వందకు పైగా ఓట్లు ఉండడంతో విస్మయం చెందుతున్నారు ప్రతిపక్ష నేతలు. 2024 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుని వైసీపీ ఓట్ల రాజకీయం చేస్తుందంటూ మండిపడుతున్నారు. ఒకపక్క ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగించడమే కాకుండా దొంగ ఓట్లను సృష్టిస్తూ ఎన్నికల కమిషన్ నే అభాసపాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 50 డివిజన్లలో ఇలా ఒకే డోర్ నెంబర్ వందలాది ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నియోజకవర్గంలో 25 లక్షల పైగా ఓట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఊరు పేరు తెలియని వారికి డివిజన్లో డోర్ నెంబర్లు వేసి దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. ఇప్పుడు పదివేలకు పైగా కొత్తగా దొంగ ఓట్లు వచ్చి పడ్డాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మక నిరెత్తినట్టు వ్యవహస్తున్నారు. తమ డోర్ నెంబర్ కు ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయంటూ అధికారులను నిలదీస్తున్నారు స్థానికులు.
ఒకే డోర్ నెంబర్ తో ఫేక్ వోట్లు సృష్టించిన అధికారులు ఆ డోర్ నెంబర్ లో ఉన్న అసలు ఓట్లు తీసేశారు. ఇక కొంతమంది ఓట్లు అసలు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదు.జిల్లాలో పలు గ్రామాల్లో టీడీపీకి చెందిన ఓట్లను తొలగించారని, సంబంధం లేని వ్యక్తులకు ఫేక్ ఓట్లు సృష్టించారంటున్న టీడీపీ నేతలు ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఇలా దొంగ ఓట్లు సృష్టిస్తున్నారంటున్నారు టీడీపీ ఏలూరు ఇంచార్జ్ బడేటి చంటి. ఒక్కో డోర్ నెంబర్ లో 150 ఓట్లు నుంచి 250 ఓట్ల వరకు కొత్తగా ఓట్లు వచ్చి పడ్డాయన్నారు. ఓట్ల అవకతవకలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు.
అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు జనసేన ఏలూరు ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను వైసీపీ దొడ్డిదారిన జరిపేందుకు చూస్తుందంటూ మండిపడ్డారు. దీనికి అధికారులు సైతం సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్.. తక్షణమే స్పందించి ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com