Morning News : మార్నింగ్ 10 am న్యూస్.. ఫటాఫట్..!

1. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకొని ఆయన నిన్ననే హైదరాబాద్ వచ్చారు. గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే పల్స్ కనిపించలేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
2. మంత్రి గౌతమ్‌రెడ్డి.. రెండుసార్లు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే పోస్ట్ కోవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమని అనుమానిస్తున్నారు. గౌతమ్‌రెడ్డి మరణవార్త తెలుసుకున్న బంధువులు హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు.
3. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
4. విశాఖలో 12వ నౌకాదళ సమీక్ష గ్రాండ్‌గా మొదలైంది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, రక్షణమంత్రి సహా పలువురు ప్రముఖుల హాజరయ్యారు. 10వేల మంది సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. అటు సముద్రతీరంలో 60 యుద్ధ నౌకలు, 55 యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి.
5. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సెర్ఫ్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు.
6. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టంచేశారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమస్య మూలాలను తెలుసుకోవడం లేదన్నారు.
7. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ శ్రీకాకుళం జిల్లాలో CITU ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించింది. కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో అంగన్వాడీల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి.
8. కృష్ణా జిల్లా ఏ కొండూరులో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో.. ఏపీ ఎస్టీ కమీషన్ చైర్మన్ కుంబా రవిబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో రికార్డులు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..వంటసామగ్రిలో కూడా నాణ్యత లేదని, విద్యార్థులకు పాఠాలు కూడా సరిగ్గా చెప్పట్లేదన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సంక్షేమశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
9. దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబా పేలుళ్లకు తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న బస్టాండ్ వద్ద బాంబులు పేలడంతో 17 మంది మరణించారు. పేలుళ్లకు పాల్పడ్డ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ ఇప్పటికీ శిక్ష ఖరారు కాలేదు.
10. కామారెడ్డి బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి శివారులో.. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదం కారణంగానే రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధితులు నిరసన చేస్తున్నారు.
11. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో.. మదిగల్లులో వేరుశనగ పంట పొలాల్లో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. దీంతో చుట్టుపక్కల రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు దీనిపై వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
12. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దగోపానపల్లిలో దుండగులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ ఫార్చునర్ కారుకు నిప్పంటించి పరారయ్యారు. దీంతో కారు పూర్తిగా దహనమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
13. మెదక్ జిల్లా ఘనపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అజ్మీర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్లు పేలయడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. మృతులు అజితా బేగం, దహియా బేగంగా గుర్తించారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
14. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా రోజుకు 15వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం జారీ చేసిన టోకెన్లు పొందిన వారు నాలుగు రోజుల పాటు దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టోకెన్లు జారీ సమాచారం తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
15. వన్డే, టీ-20 సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా.. విండీస్‌ను వైట్‌వాష్ చేసింది. దీంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు అదిరిపోయే ఆరంభం దక్కింది. మరోవైపు టీ-20 సిరీస్ విజయంతో ర్యాంకిగ్స్‌లో కూడా భారత్ దుమ్మురేపింది. 269 పాయింట్లతో ఇంగ్లాండ్‌ను వెనక్కునెట్టి.. అగ్రస్థానంలో నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com