MP Vemireddy : ఎంపీ వేమిరెడ్డి వరద సాయం రూ.కోటి
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు విజయవాడ వరద బాధితుల సహాయార్ధం భారీ విరాళం అందించారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన వారికి సహాయ సహకారాలు అందించేందుకు, వారిని ఆదుకునేందుకు రూ. కోటి చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.
ఇటీవల వచ్చిన వరదలతో విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. వేలాదిమంది ప్రజలు తిండీ, నీరు లేక అల్లాడిపోయారు. ఇప్పటికీ పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అన్నార్తులు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరదలతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ప్రజల సహాయార్థం, వారి బాగోగుల కోసం ఎంపీ వేమిరెడ్డి దంపతులు విరాళం అందించి మానవత్వం చాటుకున్నారు.
విపత్తు నుంచి ప్రజలు త్వరగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు. రూ. కోటి రూపాయలు అందించిన వేమిరెడ్డి దంపతులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూపుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com