MUDRAGADA: జనసేనలోకి ముద్రగడ!

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ ముద్రగడ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజగా ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నాయకుడు కల్వకొలను తాతాజీ, ఇతర ముఖ్య నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి రెండు గంటలకు పైగా ఆయనతో భేటీ అయ్యారు. గురువారం ఉదయం తెలుగుదేశం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరికొందరు టీడీపీ నాయకులూ కలిసి ముద్రగడ ఇంటికి వెళ్లి చర్చించారు. ఈ భేటీలు రాజకీయపరమైనవేనన్న చర్చ జరిగింది. జగ్గంపేట మండలం ఇరిపాకలో కోటి శివలింగార్చనకు ముద్రగడను ఆహ్వానించడానికే వెళ్లానని, హైకమాండ్ తనను పంపలేదని జ్యోతుల నెహ్రూ మీడియాకు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నానని సహకారం ఇవ్వాలని కోరితే అందుకు ముద్రగడ హామీ ఇచ్చారని నెహ్రూ వెల్లడించారు.
కొందరు కాపులను వైసీపీ కావాలనే రెచ్చగొడుతోందని, వారి ఉచ్చులో పడొద్దని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇటీవల బహిరంగ లేఖ రాశారు. కాపు పెద్దలు తిట్టినా దీవెనలుగానే తీసుకుంటానని, నాయకులు ఎవరొచ్చినా గుమ్మాలు తెరిచే ఉంటాయని అందులో పేర్కొన్నారు. దీనిపై ముద్రగడ తన అనుచరుల వద్ద సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముద్రగడకు ఆప్తులుగా ఉండే జనసేన, కాపు నాయకులు ఆయనను జనసేన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేశారు. ముద్రగడ నివాసానికి వెళ్లి చర్చించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి పవన్‌కల్యాణ్‌కు ఇవ్వాలని ఓ లేఖ రాసి జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఖను పవన్‌కల్యాణ్‌కు అందజేసిన తరవాత భవిష్యత్తు పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో పవన్, ముద్రగడలు భేటీ కావచ్చనే మాట వినిపిస్తోంది.
జనసేన, టీడీపీ, కాపు నేతలు ముద్రగడతో వరుసగా సమావేశం కావడంతో వైసీపీ అప్రమత్తమైంది. నేరుగా ఓ ఎమ్మెల్సీ ముద్రగడకు ఫోన్‌చేసి మీ ఇంటికి వస్తానని చెప్పగా.. రావద్దు.. మీ పని మీరు చూసుకోండి.. మీ పార్టీలో చేరే ఉద్దేశం లేదని ముద్రగడ చెప్పేశారన్న ప్రచారం చక్కర్లు కొడుతోంది. తాజా పరిణామాలపై ముద్రగడ గానీ, ఆయన కుమారుడుగానీ అధికారికంగా స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com