Nallapareddy Prasanna Kumar Reddy: నల్లపురెడ్డి కుటుంబంలో వార్.. కొడుకులు, మనవళ్ల మధ్య ఆధిపత్య పోరు..

Nallapareddy Prasanna Kumar Reddy: నల్లపురెడ్డి కుటుంబంలో వార్.. కొడుకులు, మనవళ్ల మధ్య ఆధిపత్య పోరు..
X
Nallapareddy Prasanna Kumar Reddy: నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ఎక్కడ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు.

Nallapareddy Prasanna Kumar Reddy: నాడు బద్ధశత్రువులైన ఇద్దరు నేతలు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు వారి వారసులు పరువును బజారుకీడుస్తున్నారా? నల్లపురెడ్డి ఇంటి గుట్టును రచ్చ కీడ్చి గోల చేస్తున్నారా? సొంత కుటుంబంలోనే ఆధిపత్య పోరు రగులుతోందా? రక్త సంబంధాన్ని మరిచి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారా? కోట పంచాయతీపై ఆధిపత్యం కోసం నల్లపురెడ్డి కుటుంబంలో వార్ నడుస్తోందా? సోషల్ మీడియా వేదికగా రాజకీయం రాజుకోవడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి?

70 ఏళ్ల రాజకీయ చరిత్రలో రాజకీయ శాశ్వత శత్రువులుగా ఉన్న ఒకే ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ఎక్కడ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లిన దాఖలాలు లేవు. వారు బతికినంత కాలం ఒకరి ఇలాకాలో మరొకరు కల్పించుకోలేదు. అలాంటిది ఇప్పుడు వారి వారసులు మాత్రం ఇంటి గుట్టు రచ్చకీడ్చి నల్లపురెడ్డి పరువును బజారులో పెడుతున్నారని నెల్లూరు జిల్లాలో జనం చెవులు కొరుక్కుంటున్నారు.

ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, వివిధ శాఖల మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టి అసెంబ్లీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఘనత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డిది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నాయకులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డిలకు.. శ్రీనివాసులు రెడ్డి మనవళ్లు చంద్రశేఖర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కిందని ప్రచారం జరుగుతోంది.

నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని విమర్శలు గుప్పించుకుంటుండడం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు తమ పెద్దల వ్యక్తిగత విషయాలు కూడా విమర్శించే స్థాయికి దిగజారారని ప్రచారం జరుగుతోంది.

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి.. అన్న పంపించాడు పంచాయతీ అభివృద్ధి కోసం అంటూ ఫోటోలు, వీడియోలు తీసి పంచాయతీ అభివృద్ధి ఏది? ఎంత తిన్నారు? ఎంత ఖర్చు చేశారు? అదంతా కక్కిస్తానంటూ వీడియోతో కలిగిన వాయిస్ రికార్డింగ్ లు పెట్టడం హాట్ టాపిక్ అయింది. ఇక నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి.. నువ్వు ఎవరు? నువ్వేంటి చేసేది? పంచాయతీ నాది. నేను గెలిపించుకున్నాను. నేను చెప్పిందే జరుగుతుంది.

ఇప్పుడే అభివృద్ధి పనులు చేపిస్తాను. చూడు అంటూ వీడియోలు తీసి వాయిస్ రికార్డింగ్ లతో కలిపి సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశమైంది. నేను ఇక్కడే ఉన్నాను. తేల్చుకుందాం రా? ఎవరు డబ్బులు తిన్నారు? ఎవరు దోచుకున్నారు? లెక్కలతో సహా తేల్చుకుందాం? అంటూ సవాలు విసురుతూ సోషల్ మీడియా వేదికగా ఒకరికొకరు వార్నింగులు ఇచ్చుకోవడం.. చివరికి పెద్దలపై విమర్శలు చేయడం కాక పుట్టిస్తోంది.

ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడమే కాదు.. ఎవరిపేరైతే చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చారో.. ఆ మహానుభావుడిని సైతం విమర్శించే స్థాయికి వచ్చారంటున్నారు స్థానికులు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డి.. ఒక వీధిలోకి వచ్చి.. నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి వారసులం మేమే అంటారు. మరో వీధిలో.. పంచాయితీ నాదే, అభివృద్ధి చేసింది నేనే.. మీరెవరు అంటూ ప్రశ్నిస్తారు అబ్బాయి వినోద్ కుమార్ రెడ్డి.

నల్లపురెడ్డి కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న రచ్చ కోట గ్రామంతోపాటు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. వారి తీరుపై స్థానికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబాయ్, అబ్బాయిల మధ్య జరుగుతున్న ఆధిపత్య వార్ వైసీపీలో చర్చనీయాంశమైంది. మరి ఈ వార్ ని ఇకనైనా ఆపుతారా? లేక కంటిన్యూ చేస్తారా అనే దానిపై చర్చ నడుస్తోంది.

Tags

Next Story