Nara Bhuvaneshwari : ఏపీ అసెంబ్లీ ఘటనపై స్పందించిన నారా భువనేశ్వరి..!

Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి మౌనం వీడారు. ఏపీ శాసనసభ సాక్షిగా కొందరు సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో తనకు జరిగిన అవమానం మరెవరికీ జరక్కూడదంటూ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కష్టకాలంలో, ఆ అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసి, తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనకు జరిగిన అవమానం సొంత తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టు భావించి.. అందరూ అండగా నిలబడడం జీవితంలో మర్చిపోలేనని అన్నారు.
చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్నగారు తమను విలువలతో పెంచారని, నేటికీ తాము వాటిని పాటిస్తున్నామమని వివరించారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపిచ్చారు. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని కోరారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని ఆకాంక్షించారు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరక్కుండా ఉండాలని ఆశిస్తున్నానంటూ భువనేశ్వరి లేఖలో పేర్కొన్నారు.
చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక, విపక్షం నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసెంబ్లీలో కొందరు YCP సభ్యులు దారుణమైన రాజకీయానికి తెరతీశారు. బాబు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని, శీలాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఇంత వరకూ మౌనంగానే ఉండిపోయారు నారా భువనేశ్వరి. నందమూరి కుటుంబ సభ్యులంతా మీడియా ముందుకు వచ్చినా అప్పుడు కూడా ఆమె తన మనసులో మాట బయటకు పంచుకోలేదు.
కడప, చిత్తూరు సహా అనేక చోట్ల వరద బాధిత ప్రాంతాల్లో NTR మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించారు. కొందరు దిగజారిన నేతలు చేసిన విమర్శలు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేవనే సంకేతాన్నిస్తూ చివరికి ఇప్పుడు ఈ కష్టకాలంలో తనకు అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు చెప్తూ లేఖ రాశారు.
ఇటీవల అపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారు. ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేక నీచమైన రాజకీయానికి తెరతీశారు. చంద్రబాబును నేరుగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. నాటి ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. తన కుటుంబంపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పుకునేందుకు మైక్ కూడా ఇవ్వకపోయేసరికి తీవ్ర ఆగ్రహంతో సభను బహిష్కరించారు. మళ్లీ CMగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు.
తర్వాత ప్రెస్‌మీట్‌లో సభలో పరిణామాలపై మాట్లాడుతూ భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్ని కలచి వేసింది. దీనిపై నందమూరి కుటుంబం కూడా స్పందించి వైసీపీ సభ్యులు తీరు మార్చుకోవాలని హెచ్చరించింది. చివరికిప్పుడు భువనేశ్వరి నాటి అరాచక ఘటనపై స్పందిస్తూ.. తనకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com