CBN: వైసీపీ అక్రమ కేసులను అడ్డుకోండి

CBN: వైసీపీ అక్రమ కేసులను అడ్డుకోండి
గవర్నర్‌కు చంద్రబాబు లేఖ.... టీడీపీ నేతల అణిచివేతే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపాటు..

తెలుగుదేశం నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా. అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ..తెలుగుదేశం నేతలను వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ APSDRI దుర్వినియోగంపై మండిపడ్డారు. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని APSDRI ద్వారా తెలుగుదేశం నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విపక్షాలను వేధించేందుకు ఆయుధంగా వాడుకుంటోందని లేఖలో వివరించారు. ఇదే విభాగం ద్వారా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్తిపాటి కుమారుడిని ఇరికించి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నారన్న చంద్రబాబు APSDRIని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని గవర్నర్ ను కోరారు.


మరోవైపు జీఎస్టీ పన్ను చెల్లించలేదనే ఆరోపణలతో మాచవరం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని ప్రత్తిపాటి శరత్ విజయవాడ ఫస్ట్ A.C.M.M కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో లోతైన విచారణ చేసేందుకు శరత్ ను పది రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఇరువర్గాలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు జగన్ ప్రభుత్వం... తప్పుడు కేసులతో ప్రతిపక్షాల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తుందని..... మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కక్ష సాధింపు, విధ్వంసం రెండు కళ్లుగా జగన్ తన ఐదేళ్ల పాలన సాగించారని మండిపడ్డారు. గద్దె దిగే సమయంలో కూడా అదే విధ్వేషంతో వ్యవహరిస్తున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story