Nara Lokesh: యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధం

Nara Lokesh: యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధం
ఈ నెల 27 నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం: 400 రోజుల పాటు సుమారు నాలుగువేల కిలోమీటర్ల మేర పాదయాత్ర...

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27 నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నాలుగువందల రోజుల పాటు సుమారు నాలుగువేల కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1.20గంటలకు జూబ్లీహీల్స్ లోని తన నివాసం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నివాసం నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. 1.45గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని కపడ వెళ్లనున్న లోకేష్‌ సాయంత్రం అమీన్ పీర్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా కడపలోని రోమన్ కేథలిక్ చర్చిని కూడా సందర్శించనున్నారు.

ఇక అక్కడి నుంచి రాత్రికి రోడ్డుమార్గాన తిరుమల చేరుకోనున్నారు. 26 శ్రీవారిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా కుప్పం వెల్లనున్నారు. మరో వైపు పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఇప్పటికే కుప్పం చేరుకుంటున్నారు. కుప్పం సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు లోకేష్‌ పాదయాత్ర కొనసాగనుంది. 27న ఉదయం 11.03 నిమిషాలకు లోకేష్‌ పాదయాత్రకు తొలి అడుగు పడనుంది. మొత్తం వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్‌ మ్యాప్‌ రెడీ చేశారు.

లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అప్రమత్తం అయ్యారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రకు సంబంధించి వినూత్న ప్రదర్శనలు చేస్తున్నారు. తాజాగా విజయవాడలో టీడీపీ శ్రేణులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. లోకేష్ పాదయాత్రకు మద్దతుగా ఫ్లాష్ మాబ్ నిర్వహించినట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story