Nara Lokesh : 24వ రోజుకు చేరుకున్న యువగళం

తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 24 వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకూ 312 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది. ఇవాళ ఉదయం 8 గంటలకు కోబాక విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. కొత్తవీరాపురంలో స్థానికులతో సమావేశం నిర్వహిస్తారు లోకేష్. అనంతరం మడిబాకలో రైతులతో సమావేశం అవుతారు. మడిబాకలో భోజన విరామం తర్వాత పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. మునగలపాళెంలో స్థానికులతో ముచ్చటిస్తారు లోకేష్. అక్కడి నుంచి వికృతమాల గ్రామానికి చేరుకోనున్న లోకేష్ అక్కడ స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు. సాయంత్రం పాపానాయుడుపేటలో కైకాల సామాజిక వర్గ నేతలతో భేటీ అవుతారు. రాత్రి రేణిగుంట మండలం జీ పాలెం విడిది కేంద్రంలో బస చేస్తారు.
మంగళవారం శ్రీ కాళహస్తి నుంచి కోబాక వరకు పాదయాత్ర చేసిన లోకేష్....స్థానికులతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు. వారిలో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై లోకేష్ నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి మయంగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని.. మద్యం అమ్మకాలతో జగన్ రాష్ట్ర ఖజానాను నింపుకుంటున్నారని ఆరోపించారు.
పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది. సమస్యలతో తనవద్దకు వచ్చే ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓపికగా సమస్యలు వింటున్నారు. వారి సమస్యలకు పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. లోకేష్‌కు మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com