TDP: టీడీపీ వినూత్న నిరసన "కాంతితో క్రాంతి"

TDP: టీడీపీ వినూత్న నిరసన కాంతితో క్రాంతి
రేపు రాత్రి ఏడు గంటలకు కాంతితో క్రాంతి... వెలుగులు ప్రసరింపజేయాలన్న బ్రాహ్మణి

టీడీపీ అధినేత చంద్రాబాబుకు మద్దతుగా నారా భువనేశ్వరి, లోకేష్ , ఆయన సతీమణి బ్రహ్మిణి 'కాంతితో క్రాంతి' పేరిట వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రేపు రాత్రి(శనివారం రాత్రి‌) 7 గంటల నుంచి 7 గంటల5 నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి దార్శనికుడు చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని సూచించారు. రోడ్లపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దామన్నారు. బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లు, టార్చ్ లైట్లు వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించాలన్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేలా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. ప్యాలెస్‌లో ఉన్న జగనాసురుని కళ్లు బైర్లు కమ్మెలా చంద్రబాబుకు మద్దతునివ్వాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.


చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘కాంతితో క్రాంతి’ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన వేళ బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు. మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అని కొందరు అంటున్నారని, చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. కానీ ఏపీలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదన్న బ్రాహ్మణి... మనమెందుకు చీకట్లో ఉండాలని అన్నారు. అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దామని బ్రాహ్మణి పిలుపునిచ్చారు.


మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ...పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసనలు 25 వ రోజు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు అధిక సంఖ్యలో కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసుల్లో అరెస్టు చేసిన చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలంటూ బాబుతో మేము అనే ఫ్లకార్డులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు కాల్దరి గ్రామం నుంచి తిమ్మరాజుపాలెం శ్రీ కోట సత్తమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ ఛైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్...దీక్షలో కుర్చున్నవారికి నల్ల కండువాలు కప్పారు.

Tags

Read MoreRead Less
Next Story