LOKESH: చంద్రబాబు భద్రతపై లోకేశ్‌ ఆందోళన

LOKESH: చంద్రబాబు భద్రతపై లోకేశ్‌ ఆందోళన
దొంగ కేసు పెట్టి బాబును వేధిస్తున్నారన్న లోకేశ్‌.... న్యాయం గెలిచి తీరుతుందని ధీమా

వైసీపీ ప్రభుత్వ తప్పులు బయటపెట్టి ప్రజల తరఫున పోరాడినందుకే దొంగ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణీతో కలిసి లోకేశ్‌ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యారు. విజయవాడ నుంచి భారీ ర్యాలీతో లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత అక్కడ భువనేశ్వరి, బ్రాహ్మణిలను లోకేష్ కలుసుకున్నారు. నారా లోకేష్‌ను కలుసుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి భావోద్వేగానికి గురైయ్యారు. కాసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది.


ములాఖత్‌ తర్వాత మాట్లాడిన లోకేష్‌ రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబును రిమాండ్‌కు పంపారని మండిప‌డ్డారు. తమ కుటుంబం మొత్తాన్ని జగన్ రోడ్డుపైకి తీసుకొచ్చారని, తాము నమ్ముకున్న సిద్దాంతాల కోసం పోరాడుతూనే ఉంటామని లోకేష్ చెప్పారు. ప్రమాణస్వీకారానికి తప్ప తన తల్లి ఇప్పటివరకు ఏ కార్యక్రమానికి హాజరుకాలేదని, ఈ పిచ్చి జగన్ వల్ల రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని అన్నారు. తాము భయపడేది లేదని, కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు. స్కిల్‌ కేసులో వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ACB కోర్టులో నిన్న జరిగిన వాదనలతో స్కిల్‌ కేసులో అవినీతి జరగలేదని తేటతెల్లమైందని వివరించారు. చంద్రబాబును అరెస్టు చేసిన 28 రోజుల తరువాత కూడా దర్యాప్తు సంస్థ ఆధారాలు చూపలేకపోవడంతో కేసుల్లో డొల్లతనాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు.


రాజకీయ పార్టీగా టీడీపీకి వచ్చిన విరాళాలనే అవినీతి సొమ్ము అని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నమ్మించే ప్రయత్నం చేసి సిఐడి మరింత అభాసుపాలైందని లోకేష్ అన్నారు. ప్రజాబలం ముందు అధికార బలం, ధన బలం నిలిచే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. రాజమండ్రి జైలు ఆవరణలో డ్రోన్లు కూడా ఎగిరాయన్న లోకేష్‌ చంద్రబాబు భద్రతపై ఇప్పటికీ తమకు ఆందోళన ఉందన్నారు. జైళ్లో నక్సలైట్లు, గంజాయి స్మగ్లర్లున్నారని చంద్రబాబుకు తగిన భద్రత లేదన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి, 28 రోజులు రిమాండ్‌కు పంపారన్న లోకేష్‌ న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం తమవైపే ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు వెనక కేంద్రం ఉందనడానికి ఆధారాల్లేవన్న లోకేష్‌, ఢిల్లీ పర్యటనలో తాను ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్లు అడగలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన కలిస్తే వైసీపీకి కంగారెందుకన్న లోకేష్‌ త్వరలోనే ఇరుపార్టీల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గడప గడపకు 'బాబుతో నేను' కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story