Nara lokesh : దిశ చట్టం ఏమైందో జగన్ సమాధానం చెప్పాలి : లోకేష్

దిశ చట్టం ఏమైందో జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచకాలు, దాడులు జరుగుతున్నా అరెస్టులు చేయడం లేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎర్రబాడులో ఏడాది క్రితం దారుణ హత్యకు గురైన హాజీరా కుటుంబ సభ్యుల్ని లోకేష్ పరామర్శించారు. అయేషా కుటుంబానికి రాజశేఖర్‌రెడ్డి, హాజీరా కుటుంబానికి జగన్ న్యాయం చేయలేదని విమర్శించారు.
సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన యువకుల్ని జైలుకు పంపిస్తున్న జగన్.... హత్య కేసు నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయించడం లేదని ప్రశ్నించారు. సొంత బాబాయిని హత్య చేసిన నిందితుల్ని కూడా పట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఏపీలో హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకు న్యాయం జరగడం లేదని అన్నారు. రానున్న రోజుల్లో తాడేపల్లి తలుపుల్ని తడతామని లోకేష్ హెచ్చరించారు. జగన్‌కు ముస్లింల ఓట్లు కావాలి కానీ.. న్యాయం మాత్రం చేయడు అని విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డిని గద్దె దించేందుకు ముస్లింలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
లోకేష్ ఎర్రబాడుకు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నారు. హాజీరా కుటుంబాన్ని తాము కూడా పరామర్శిస్తాంటూ వైసీపీ నేతలు బయల్దేరారు. ఎమ్మిగనూరు నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న వైసీపీ వర్గీయుల్ని పిల్లిగుండ్ల గ్రామం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వైసీపీ వర్గీయులు గొడవకు దిగారు. బళ్లారి చౌరస్తా కూడలిలోనూ వైసీపీ నేతలు ఆటంకాలు సృష్టించారు. రోడ్డుపై బైఠాయించి లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
లోకేష్‌ను అడ్డుకునేందుకు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్ ఖాన్ వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. బళ్లారి చౌరస్తాలో లోకేష్‌ను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు మోహరించినా... పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మరోవైపు... ఎర్రబాడులోనూ వైసీపీ కుట్రలు కొనసాగాయి. ఎమ్మిగనూరుకు చెందిన వైసీపీ కౌన్సిలర్ ఇసాక్, టౌన్‌బ్యాంక్ డైరెక్టర్ చాంద్ బాష... ముందుగానే ప్రజల్లో కలిసి వచ్చారు. యాత్రలో జనంలో కలిసి.. లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com