LOKESH: ఓటమి భయంతోనే దాడులు

LOKESH: ఓటమి భయంతోనే దాడులు
వైసీపీది ఫ్యాక్షన్‌ పాలన అన్న లోకేశ్‌... జగన్‌ గాల్లో తిరుగుతూ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారన్న అచ్చెన్న...

ఓటమి భయంతో తెలుగుదేశం నేతలలపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. చంద్రగిరి మండలం భీమవరంలో తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై అధికార పార్టీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేయడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిరత్నం పరిస్థితి విషమంగా ఉందన్న లోకేష్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మునిరత్నంపై దాడిని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఖండించారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం జగన్ గాల్లో తిరుగుతూ..రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేశాని మండిపడ్డారు. చెవిరెడ్డి తన చెంచాలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్‌ గాల్లో తిరుగుతూ.. శాంతి భద్రతలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఎన్ని దాడులు చేసినా తెలుగుదేశం వెనకడుగు వేయదన్న విషయాన్ని వైసీపీ గూండాలు గుర్తుంచుకోవాలన్నారు. దాడి చేసిన వైసీపీ నేతలపై ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మునిరత్నం నాయుడుపై... వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేయడం దారుణమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత ఓటమి భయంతోనే చెవిరెడ్డి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.


చంద్రగిరి నియోజకవర్గం భీమవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడు వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం చిన్నరామాపురంలో జరిగిన కుటుంబ గొడవల్లో మధ్యవర్తిగా మునిరత్నం నాయుడు బాధితులతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ వెళ్లారు. ఇరువర్గాలకు సఖ్యత కుదరకపోవడంతో ద్విచక్రవాహనంపై స్వగ్రామం భీమవరం వెళ్తుండగా చంద్రగిరి గ్రామ పొలిమేర్లలో వైపీసీ కార్యకర్తలు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మునిరత్నంను స్థానికులు హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌కు తీసుకెళ్లారు. రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, వైసీపీ కార్యకర్త మట్టిరెడ్డి, అతని అనుచరులు బండరాళ్లతో తనపై దాడి చేశారని బాధితుడు మునిరత్నం వాపోయారు. దాడికి పాల్పడిన వారు MLA చెవిరెడ్డి అనుచరులేనని చెప్పారు. ఈ సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆస్పత్రికి వెళ్లి మునిరత్నాన్ని పరామర్శించడం చర్చనీయాంశమైంది.

Tags

Read MoreRead Less
Next Story