ఇది వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం.. నారా లోకేష్ ఫైర్!

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వైసీపీ నేతలు ఏకంగా శ్రీవారి లడ్డూనే ఉపయోగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీలో ఈ తరహాలో ఓట్లను అభ్యర్థించడం మొదలు పెట్టారు వైసీపీ వర్గీయులు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ స్లిప్పులతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పంచడం వివాదాలకు దారి తీసింది. పైగా ఇంటింటికీ రేషన్ వాహనాల్లో లడ్డూలను పంచుతూ వైసీపీ మద్దతుదారులకు ఓటు వేయాలని ప్రలోభపెడుతున్నారు. బహిరంగంగా ఇంత జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.
అటు ఈ ఘటపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూలను ఓట్ల స్లిప్పులతో కలిసి పంచుతూ స్వామివారికి మహాపచారం తలపెట్టారని మండిపడ్డారు. జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఎన్నికలపైనే కానీ, ఏడుకొండలవాడిపై భక్తిలేదని ట్వీట్ చేశారు. సన్నాసుల సన్నబియ్యం వ్యాన్లలో లడ్డూలను తరలించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు. ఎస్సీలకు 5 లడ్లు, ఇతరులకు 10 లెక్క చొప్పున పంపిణీ చేసి.. కులవివక్ష చూపారన్నారు. ఓట్లకు కోట్లు వెదజల్లుతున్నా.. పల్లెల్లో జగన్ రెడ్డిని జనం నమ్మడం లేదని దుయ్యబట్టారు నారా లోకేష్.
శ్రీవారి లడ్డూలిస్తే భక్తితోనైనా ఓటేస్తారని వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం ఇది అంటూ లోకేష్ మండిపడ్డారు. హిందువులకు అత్యంత పవిత్రమైన లడ్డూలను ఓటర్లకు తాయిలాలుగా పంచిన అభ్యర్థి పోటీకి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొండపై భక్తులకు ఒక లడ్డూ దొరకని పరిస్థితిలో.. ఇన్ని వేల లడ్డూలు తరలించిన వైసీపీ నేతలు, వారికి అందించిన టీటీడీ యంత్రాంగంపై చర్యలు చేపట్టాలని కోరారు. స్వామికి జరిగిన అపచారం, వ్యాన్లలో తరలింపు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, కులవివక్షలపై కేసులు నమోదు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com