Nara Lokesh : ఈ నెత్తుటి రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు : నాారా లోకేష్

Nara Lokesh : విజయవాడ నగరంలో మళ్లీ రాజకీయ రగడ రాజుకుంది. బెజవాడకు మరోసారి రక్తం మరక అంటుకుంది. టీడీపీ సీనియర్‌నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. పటమటలంకలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద గాంధీపై వైసీపీకి చెందిన వర్గీయులు దాడి చేసి గాయపర్చారు. కంటికి తీవ్రగాయాలైన చెన్నుపాటి గాంధీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చెన్నుపాటి గాంధీపై వైసీపీ వర్గీయులు, దేవినేని అవినాష్ మనుషులే దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చెన్నుపాటి గాంధీ భార్య తొమ్మిదో డివిజన్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ మద్యం మత్తులో కావాలని గొడవపడినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, వైసీపీ నాయకులు గద్దె కల్యాణ్, సుబ్బుతో పాటు మరో ముగ్గురు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ దాడిని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. గాంధీ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. దాడిలో గాంధీ కంటికి తీవ్ర గాయమైందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. మెరుగైన చికిత్స అందేవిధంగా చూడాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని చంద్రబాబు పోలీసులను కోరారు.
ఇంకెన్నాళ్లీ నెత్తుటి రాజకీయాలు చేస్తారంటూ నారా లోకేశ్ వైసీపీపై మండిపడ్డారు. చెన్నుపాటి గాంధీ పై దాడికి తెగబడింది వైసీపీ ఫ్యాక్షన్ మూకలే అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే టీడీపీ నేతలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమైందని మండిపడ్డారు. విజయవాడలో మళ్లీ రౌడీయిజం పురుడుపోసుకునే ప్రమాదం ఉందన్నారు. కన్నుపోయేలా దాడిచేస్తే.. నిందితులను అరెస్ట్ చేయకుండా లీగల్ ఒపీనియన్ అడగడం అమానుషమన్నారు వర్ల రామయ్య
ఇదిలా ఉండగా టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ పై దాడి ఘటనలో కేసు నమోదు చేశామని సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, క్షణికావేశంలోనే చెన్నుపాటి గాంధీపై దాడి చేశారని తెలిపారు. ప్రత్యేక బృందాలను నియమించి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీస్తున్నామన్నారు. దాడి టైంలో ఎటువంటి మారణ ఆయుధాలు ఉపయోగించలేదని పిడిగుద్దులు గుద్దుకున్నారని అన్నారు. స్పాట్ లో ఉన్నవారిని కూడా విచారిస్తున్నామన్నారు. నగరంలో గొడవలు జరుగుతున్నాయనడంలో వాస్తవం లేదన్నారు కమిషనర్ కాంతి రాణా టాటా.
చెన్నుపాటి గాంధీ పటమటలంకలో ఉంటున్నారు. గాంధీ శనివారం సాయంత్రం పాఠశాల వద్ద డ్రైనేజీ పనులను పరిశీలించి, స్కూటర్‌పై వెళ్లిపోతుండగా వైసీపీ నేతలు గద్దె కల్యాణ, సుబ్బు ఆయనను బాబాయ్ అని పిలిచారని సీపీ తెలిపారు. దీంతో గాంధీ ఆగారు. 'డ్రైనేజీ సమస్యపై మేం మాట్లాడుకోలేమా!' అంటూ గాంధీతో వాదనకు దిగారు. ఇంతలో పక్కనే ఉన్న సుబ్బు గాంధీ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనలో గాంధీ కుడి కన్నుకు తీవ్ర గాయమైందని సీపీ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com