Nara Lokesh: అమ్మ ఒడి ఇవ్వడానికి కొడుకు బడిని బలిపీఠంపై ఎక్కిస్తారా: ఏపీ సీఎంకు లోకేష్ లేఖ

Nara Lokesh: ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు.. సీఎం అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్లు డెడ్ అవ్వడమే కాకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మరణశాసనం కావడం చాలా విచారకరమన్నారు.. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేయాలనేది పాలకుడి లక్ష్యమైతే.. ఒకే ఒక్క విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తే చాలని తత్వవేత్త మాకియవెల్లి అన్న మాటల్ని లోకేష్ లేఖలో ప్రస్తావించారు.. మీలాంటి విధ్వంస ఆలోచనలున్న పాలకుల గురించి హెచ్చరించి చెప్పిందే మీరు చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.. విద్యా వ్యవస్థపై మీరు చేస్తున్న దాడి చూస్తుంటే అన్ని వ్యవస్థల ధ్వంసానికి తెగబడుతున్నట్టేనన్నారు లోకేష్.
అమ్మ ఒడి ఇవ్వడానికి కొడుకు బడిని బలిపీఠంపై ఎక్కించడం భావ్యమేనా అంటూ లేఖలో ప్రశ్నించారు.. విద్యా సంస్థల ఆస్తులు చేజిక్కించుకునేందుకు మీరు తీసుకున్న ప్రమాదకరమైన నిర్ణయంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు. మొన్న విశాఖ, నిన్న కాకినాడ, నేడు గుంటూరు, రేపు మరో ప్రాంతం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్నా.. ఇంకా మీ మూర్ఖపు నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారంటే ఏమనుకోవాలంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు లోకేష్.
కలలు కనే ధైర్యం లేని దయనీయ స్థితిలో ఆంధ్రులున్నారంటూ టీఆర్‌ఎస్ ప్లీనరీలో తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలను లోకేష్ లేఖలో ప్రస్తావించారు.. ఆ వ్యాఖ్యలు మీకు ఎలా అనిపిస్తున్నాయో గానీ, ఐదు కోట్ల ఆంధ్రులు మాత్రం ఆ వ్యాఖ్యలను తీరని అవమానకరంగా భావిస్తున్నారన్నారు.. ఎయిడెడ్ స్కూళ్ల ఆస్తులపై మీ కన్ను పడటంతో అవి మూసివేతకు దారి తీసి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారని మండిపడ్డారు. అటు విద్యార్థులు, ఇటు సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైనా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.. ఎయిడెడ్ విద్యాసంస్థలను డెడ్ చేసి వాటి పరిధిలో ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకుని, 90 శాతం మంది బడుగు, బలహీన విద్యార్థులకు చదువు దూరం చేసే మీ కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులపై కన్నేసిన మీరు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం దుర్మార్గమన్నారు లోకేష్.. ఎయిడెడ్ స్కూళ్లను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.. ఏ ఒక్క స్కూలూ మూతపడకుండా చూడాలన్నారు.. తొలగించిన కాంట్రాక్టు లెక్చరర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.. అదే విధంగా ఏ ఒక్క పేద విద్యార్థికి ప్రభుత్వం చదువును దూరం చేసి నష్టపరిచినా చూస్తూ ఊరుకోబోమన్నారు.. నష్టపోయిన వారికి న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని లోకేష్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com