Nara Lokesh : కల్తీ సారాపై దమ్ముంటే ప్రభుత్వం చర్చకు రావాలి.. లోకేష్ డిమాండ్

Nara Lokesh : ఉంగుటూరు పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. కల్తీ సారా మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్నం విజయవాడ ప్రసాదంపాడులోని ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఉంగుటూరు తరలించారు. అయితే.. స్టెషన్ బెయిల్‌పై సంతకం పెట్టేందుకు ఎమ్మెల్యేలు నిరాకరించారు. ఎంతసేపైనా స్టేషన్‌లో ఉంటామని.. సంతకాలు మాత్రం పెట్టబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను స్టేషన్‌లోనే ఉంచితే తానే స్వయంగా వస్తానని చంద్రబాబు హెచ్చరికలు పంపారు. దీంతో సుదీర్ఘ మంతనాల తర్వాత సంతకాలు తీసుకోకుండా ఎమ్మెల్యేలను విడిచి పెట్టారు పోలీసులు.
ఎమ్మెల్యేలను నారా లోకేష్ పరామర్శించారు. సభలో మద్యం, కల్తీ నాటుసారాపై ప్రకటనలిచ్చి పారిపోవడం కాదని.. ధైర్యం ఉంటే చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కల్తీ నాటు సారా, జె-బ్రాండ్ మద్యంపై ప్రజా చైతన్య ఉద్యమం చేపడతామన్నారు. తెలుగు మహిళలు త్వరలోనే బెల్టు షాపులు ధ్వంసం చేస్తారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక 6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని.. 22వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. సభలో టీడీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు భయపడే సస్పెన్షన్ చేసి ప్రకటన ఇచ్చారన్నారు. అజెండాలో లేని చర్చ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశాక దొడ్డిదారిన పెట్టడం పిరికితనమేనన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com