LOKESH: నేటి నుంచి మళ్లీ యువగళం

LOKESH: నేటి నుంచి మళ్లీ యువగళం
మరోసారి జన క్షేత్రంలోకి నారా లోకేశ్‌... ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్లీ ప్రారంభం

జనగళమే తన బలంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించటమే లక్ష్యంగా ముందుకు కదిలేందుకు సిద్ధమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబరు 9న అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో ఎక్కడైతే పాదయాత్రకు విరామం ప్రకటించారో తిరిగి అక్కడి నుంచే ఉదయం 10 గంటల 19 నిమిషాలకు తిరిగి ప్రారంభం కానుంది.


అవాంతరాలను అధిగమించి లక్ష్యం దిశగా అడుగు ముందుకేసేందుకు పార్టీ శ్రేణులతో కలసి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సిద్ధమయ్యారు. సీఎం జగన్‌ కక్షసాధింపు చర్యల్లో భాగంగా స్కిల్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కావడంతో... యాత్రకు లోకేష్‌ తాత్కాలిక విరామం ప్రకటించారు. బాబుకు పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు కావటంతో నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న లోకేష్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో పొదలాడ యువగళం క్యాంప్ సైట్‌కి చేరుకున్నారు. యువనేతకు మద్దతుగా 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు పాదయాత్రలో పాల్గొననున్నారు. తాటిపాక సెంటర్‌లో బహిరంగసభ అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. నగరంలో గెయిల్, O.N.G.C బాధితులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం మామిడికుదురులో స్థానికులతో లోకేష్‌ భేటీ కానున్నారు. అక్కడ నుంచి పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా అమలాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. అనంతరం పేరూరులో రజక సామాజిక వర్గీయులతో భేటీ అవనున్నారు. రాత్రికి అక్కడే పేరూరు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.


ఉమ్మడి తూర్పుగోదావరిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనున్న యువగళం పాదయాత్ర తుని మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలన్నది మొదట అనుకున్న లక్ష్యం. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు, పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు, జగన్‌ ప్రభుత్వ అరాచకాలు, కక్షసాధింపుపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకులను కలిసి వివరించడం వంటి వ్యవహారాల్లో ఇన్నాళ్లూ లోకేష్‌ తీరిక లేకుండా ఉన్నారు. దీంతో రెండున్నర నెలల పాటు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో .. ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలన్న లక్ష్యాన్ని కుదించుకుని విశాఖలో ముగించనున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంటు కూడా కలిసి వచ్చేలా విశాఖలో పాదయాత్ర ముగించే యోచనలో లోకేష్‌ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనికి తగ్గట్టుగా రూట్‌మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story