రాయలసీమలో రికార్డులు బద్దలు కొట్టిన లోకేష్‌

రాయలసీమలో రికార్డులు బద్దలు కొట్టిన లోకేష్‌
రాయలసీమలో గత పాదయాత్రల రికార్డును తిరగరాశారు. సీమలో 124 రోజులు పాదయాత్ర చేసిన లోకేష్‌ గతంలో మరే నాయకుడు తిరగనన్ని నియోజకవర్గాల్లో నడిచారు

అడుగే పిడుగై అన్నట్లు సాగుతున్న లోకేష్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. రాయలసీమలో గత పాదయాత్రల రికార్డును తిరగరాశారు. సీమలో 124 రోజులు పాదయాత్ర చేసిన లోకేష్‌ గతంలో మరే నాయకుడు తిరగనన్ని నియోజకవర్గాల్లో నడిచారు. సీమలో మొత్తం 52 నియోజకవర్గాలకు గాను లోకేశ్ 44 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14కి 14 నియోజకవర్గాల్లో నడిచారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో 14కి 9 నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కి 14 నియోజకవర్గాలు, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 నియోజకవర్గాలు తిరిగారు. రాయలసీమలో ఇప్పటివరకు లోకేశ్ 1,587 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. యువగళంలో భాగంగా 108 మండలాలు, 943 గ్రామాల్లో లోకేశ్ పర్యటించారు.

జనవరి 27న కుప్పం శ్రీవరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైన పాదయాత్ర రాయలసీమలో 44 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 108 మండలాలు, 943 గ్రామాలమీదుగా కొనసాగింది. ఈ పాదయాత్రలో లక్షలాదిమందిని నేరుగా కలుస్తూ, అనుక్షణం ప్రజల్లో మమేకమై కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తానని భరోసా ఇస్తున్నారు లోకేష్‌. యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజలనుంచి రోజురోజుకు పెరుగుతున్న మద్దతు వైసీపీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. యువగళం చిత్తూరు జిల్లా దాటకముందే 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో వైసీపీలో ప్రకంపనలు పుట్టాయి. ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఉక్కుసంకల్పంతో ముందుకు సాగుతున్నారు లోకేష్‌. 124 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన లోకేష్. కడపలో మిషన్ రాయలసీమను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో రాయలసీమకు తాము ఏం చేయబోతున్నామో ప్రజలకు తెలియజేశారు.

ఎండా, వానలను సైతం లెక్కచేయకుండా లోకేష్ సాగిస్తున్న పాదయాత్ర సీమ టిడిపి కేడర్‌లో జోష్‌ను నింపింది. ప్రతి వందకిలోమీటర్లకు ఓ వరాన్ని ప్రకటిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం, ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బహిరంగసభల్లో వైసీపీఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టడం, టీడీపి హయాంలో అభివృద్ధి, వైసీపి ప్రభుత్వంలోని వైఫల్యాలపై సెల్ఫీ ఛాలెంజ్ లు విసరడం వంటి అంశాలు జనంలోకి బలంగా వెళ్లాయి. అందుకే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో యువగళం పాదయాత్రకు ఊహించని స్పందన వచ్చింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 200 కిలో మీటర్ల మేర నిర్వహించిన పాదయాత్రకు పెద్దఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్న లోకేష్... మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు.

లోకేష్‌ పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో జగన్ సర్కారులో వణుకు మొదలైంది. కుప్పంలో మొదలు తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు ప్రతి 20 కిలో మీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25 కేసులు నమోదు చేశారు. ఇందులో లోకేష్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు లోకేష్‌. ఇక ప్రొద్దుటూరులో కోడిగుడ్లు వేయించడం, పత్తికొండ, కర్నూలు వంటి ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నల్లజెండాలతో అడ్డుకునేందుకు విఫలయత్నం చేయగా లోకేష్ ధీటుగా సమాధానమిచ్చి తిప్పికొట్టారు.

లోకేష్ తాను పాదయాత్ర నిర్వహించే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకచోట బహిరంగసభ నిర్వహిస్తూ వాడి,వేడి వాగ్భాణాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. రాయలసీమలో యువగళం పాదయాత్ర సాగిన 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 41చోట్ల యువనేత లోకేష్ బహిరంగసభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్‌ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నారు. మొత్తానికి సీమలో గతంలో ఏ రాజకీయనాయకుడు చేయని విధంగా 124 రోజుల పాటు పాదయాత్ర చేసిన లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించి అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story