LOKESH: ప్రజా బలంతో సాగే యువగళమిది

LOKESH: ప్రజా బలంతో సాగే యువగళమిది
అధికారంలోకి వచ్చేది మేమే... వడ్డీతో సహా లెక్కలు చెల్లిస్తానని హెచ్చరిక

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజాబలంతో సాగే యువగళం ఆగదని చెప్పిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. చంద్రబాబుని చూసి భయపడే అక్రమంగా అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభించారు. తాటిపాక సెంటర్‌లో నిర్వహించిన యువగళం బహిరంగసభకు పెద్ద సంఖ్యలో హాజరైన.. తెలుగుదేశం, జనసేన శ్రేణుల నినాదాల మధ్య మాట్లాడిన లోకేశ్‌ తొలుత యాత్రకు విరామం ఇచ్చినందుకు క్షమాపణ కోరారు. ఏ తప్పు చేయని చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెడితే అనేక ఆర్థిక అరాచకాలకు పాల్పడ్డ జగన్‌ని ఎక్కడ పెట్టాలని ప్రశ్నించారు.


వైసీపీ ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొంటామన్న లోకేష్‌ మూడు నెలల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం-జనసేన ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలో గెయిల్‌, ONGC బాధితులతో మాట్లాడిన లోకేశ్‌ 2014 జూన్‌ 27న జరిగిన పైపులైన్ల పేలుడులో ఇళ్లు దెబ్బతిన్నవారికి కొత్త ఇళ్లు కట్టిస్తామని ఆ సంస్థలు ఇంకా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి బాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషిచేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.


తాను తప్పుచేస్తే.. చంద్రబాబే జైలుకు పంపుతారని.. ఏ తప్పూచేయలేదు కనుకే.. ధైర్యంగా రాజోలు సభలో ‘సైకో జగన్‌’ అని పిలవగలుగుతున్నానని లోకేశ్‌ స్పష్టం చేశారు. మీరు కేసులు పెట్టుకుంటూ పోతే భయపడడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరన్న నారా లోకేశ్‌.. భయాన్ని మీకు పరిచయం చేసే బాధ్యత తీసుకుంటానని హెచ్చరించారు. ప్రజల మద్దతే చంద్రబాబుకు కొండంత బలమని.. వ్యవస్థలను మేనేజ్‌ చేసి జైలులో బంధించారని లోకేశ్‌ ఆరోపించారు. టీడీపీ ఖాతాలకు ఒక్క రూపాయి అవినీతి సొమ్ము వచ్చిందని నిరూపించారా? ప్రజలే ఆలోచించాలి. హైకోర్టు నిజాన్ని నిలబెట్టిందని నారా లోకేశ్ అన్నారు. త్వరలో అన్న క్యాంటీన్‌ విషయంపైనా బాబుపై కేసు పెడతారని... పేదలకు అన్నంపెట్టి రాష్ట్ర ఖజానాకు అన్యాయం చేశారని రిమాండ్‌ రిపోర్టులో రాస్తారని ఎద్దేవాచేశారు.


ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. వడ్డీతో సహా కేసులు పెట్టే బాధ్యత తీసుకుంటా అని లోకేశ్‌ హెచ్చరించారు. 26 వేల మంది బీసీలపై దొంగకేసులు పెట్టారని... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్నారు. దళితులకు దక్కాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ రద్దుచేశారని మండిపడ్డారు. జగన్‌ కటింగ్‌ మాస్టర్‌.. ఫిటింగ్‌ మాస్టర్‌ అని. ఆయన బల్లపైన బ్లూ బటన్‌, బల్ల కింద ఎర్ర బటన్‌. పైది నొక్కితే రూ.10 పడుతుంది.. కింద బటన్‌ నొక్కితే రూ.100 హుష్‌మని పోతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని ప్రతినెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story