LOKESH: నేడే యువగళం ముగింపు

LOKESH: నేడే యువగళం ముగింపు
పోరాట యోధుడిలా సాగిన లోకేశ్‌ యువగళం.... ప్రజలతో మమేకమైన యువనేత

యువగళంతో జనగళమై సాగిన నారా లోకేష్‌ యువగళం యాత్ర నేడు ముగియనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర నేడు విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద ముగియనుంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలతో మమేకమై వారి కష్టాల తెలుసుకుని కన్నీళ్లు తుడుచేందుకు ఈ జనవరి 27న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారభించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా... 226 రోజుల పాదయాత్ర చేశారు. నేడు పాదయాత్ర ముగించే సమయానికి లోకేష్‌ మొత్తం 3 వేల 132 కిలోమీటర్లు నడవనున్నారు. కుప్పంలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి... అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు వైకాపా ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది. పోలీసుల్ని ప్రయోగించి, అవరోధాలు సృష్టించి, అక్రమ కేసులు పెట్టి నానా యాగీ చేసింది. చాలా చోట్ల వైకాపా నాయకులూ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా లోకేష్‌ మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు.


స్టాన్‌ఫోర్డ్‌ వంటి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశంచిన లోకేష్‌ తొలి రోజుల్లో పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాలకు సమయం వెచ్చించారు. కార్యకర్తలకు బీమా వంటి కొత్త విధానాల రూపకల్పనలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలని కలిసినప్పటికీ. ఇంతగా మమేకమయ్యే అవకాశం ఆయనకు గతంలో ఎప్పుడూ రాలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడిచి ఒక నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునే అవకాశం లోకేష్‌కు కలిగింది. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం........ వంటివి లోకేష్‌ని నాయకుడిగా మరింత రాటుదేల్చాయి.


నందమూరి తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప విరామం లేకుండా లోకేష్‌ పాదయాత్ర కొనసాగించారు. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. పార్టీ వ్యవహారాలతోపాటు, దిల్లీ వెళ్లి న్యాయవాదులతో సంప్రదించడం వంటి బాధ్యతల వల్ల ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పొదలాడ వద్ద పాదయాత్రకు విరామం పలికారు. 79 రోజుల విరామం తర్వాత నవంబరు 27న మళ్లీ పొదలాడ నుంచే పాదయాత్రను పునఃప్రారంభించారు. తొలుత జీవో నెం.1ని చూపించి... ప్రభుత్వం పాదయాత్రకు అవరోధాలు సృష్టించింది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు పోలీసులు మొత్తం 25 కేసులు నమోదు చేయగా వాటిలో మూడు లోకేశ్‌పై నమోదయ్యాయి.


అభిమానంతో తనను కలిసేందుకు వచ్చిన వారిని నిరుత్సాహపరచుకుండా చిరునవ్వుతో వారితో సెల్ఫీలు దిగిన లోకేష్ తెలుగుదేశం హయాంలో తెచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టుల వద్ద ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్‌లూ విసిరారు. స్థానిక వైకాప ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతూ అరాచకాలపై యుద్ధం చేశారు. ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక నిర్దిష్ట కాలంలోనే ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తానని... భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story