Nara Lokesh: మళ్లీ ప్రారంభం కానున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన టీడీపీ యాత్రలు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 24న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో యువగళం యాత్ర ఆగిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచే పునఃప్రారంభవం కానుంది. రేపు సాయంత్రానికల్లా యాత్రకు సంబంధించిన సమన్వయకర్తలు, వాలంటీర్లు రాజోలుకు చేరుకోవాలని పార్టీ నాయకత్వం కోరింది.
లోకేశ్ యాత్ర డిసెంబర్ చివరి వారం వరకు కొనసాగనుంది. యాత్ర పూర్తి అయ్యే సమయానికి ఆయన 3,550 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంది. యువగళం పాదయాత్ర రాజోలు నుంచి పి. గన్నవరం, అమలాపురం, కొత్తపేట, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విశాఖ దిశగా సాగుతుంది.
నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఈ ఏడాది జనవరిలో కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత రాయలసీమలో పూర్తి చేసుకుని.. కోస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరకు కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను ఆగస్టులో నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఈ పాదయాత్ర ఆగింది. దీంతో లోకేష్ రాజమహేంద్రవరం, ఢిల్లీకి పరిమితం అయ్యారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించాలని భావించినా వాయిదా వేసుకున్నారు.
అయితే ఇప్పుడు తిరిగి రాజోలు నుంచే యాత్రను ప్రారంభించనున్నారు. రానున్న ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేసే నిమిత్తం ఆయన తన పాదయాత్రను కుదించుకునే యోజనలో ఉన్నారని చెబుతుననారు. అలాగే చంద్రబాబుపై కేసులకు సంబంధించి.. సుప్రీంకోర్టులో మంగళవారం తీర్పు రావొచ్చని భావిస్తున్నారు. ఒక వేళ తీర్పు మరికొద్ది రోజులు ఆలస్యమైనా లోకేష్ పాదయాత్ర 24నే ప్రారంభం అవుతుందని.. ఇందులో మార్పేమీ ఉండదంటున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభమయ్య అంశంపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com