నేడు ఏపీ ఎస్‌ఈసీగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు..!

ఏపీ కొత్త ఎస్‌ఈసీని ప్రభుత్వం నియమించింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. దీనిని గవర్నర్ ఆమోదించారు. ఇవాళ నీలం సాహ్ని ఏపీ ఎస్‌ఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆమె నిర్ణయం తీసుకోనున్నారు. పది రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలన్న యోచనలో ఉంది ప్రభుత్వం. ఈ నెల 8వ తేదీన ఎన్నికలు.. 10న ఫలితాలు విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయ నిపుణులతో పాటు ప్రభుత్వ అధికారుల సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఎస్‌ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రతిపాదించింది. చివరికి సాహ్నిని ఎంపిక చేశారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను ప్రధాన సలహాదారుగా నియమించారు. సాహ్ని రెండేళ్ల పాటు సలహాదారుగా ఉంటారు. అయితే అంతలోనే అనూహ్యంగా ఎస్‌ఈసీగా నియమించడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com