Nellore Rains: జలదిగ్బంధంలో 29 గ్రామాలు.. నిరాశ్రయులుగా మారిన 15వేల మంది ప్రజలు..

Nellore Rains (tv5news.in)
Nellore Rains: ఏపీలో ఎడతెరపిలేని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా నెల్లూరు జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలకు వాగులు ,వంకలు పొంగి.. 29 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 15వేల మంది నిరాశ్రయులయ్యారు. గూడూరు సమీపంలోని పంబలేరు వాగు పొంగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి.
పెన్నా నది పరీవాహక ప్రాంతమంతా కకావికలమైంది. పెన్నానది పొడవునా ఊళ్లు, పట్టణాలు నీట మునిగాయి. బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లోని పలు గ్రామాలకు నీరు చేరింది. సోమశిల జలాశయం ఉన్న అనంతసాగరం మండలంలో అత్యధిక ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరు, సంగం, విడవలూరు, కలువాయి, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళ్యం తదితర మండలాలలో పంటలు, రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి.
స్వర్ణముఖి వరదతో గూడురు, వెంకటగిరి, సూళ్లూరుపేట.. కండలేరు పొంగడంతో రాపూరు మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. నాయుడుపేట, వెంకటగిరి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.జిల్లాలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
నెల్లూరు జిల్లాలో వరదల ప్రభావంతో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.. జాతీయ రహదారి దెబ్బతినడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.. మూడు రోజులుగా జిల్లా జలదిగ్బంధంలోనే ఉంది.. సోమశిల జలాశయం నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించి గ్రామాలను, నగరాలను ఒక్కటి చేసింది.. జిల్లాలో వరద పరిస్థితులపై తాజా అప్‌డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com