AP: నేరగాళ్ల ఆట కట్టించేందుకు కొత్త టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్‌లో నేరాలను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. నేరస్థులను వేగంగా గుర్తించి, పాత నేర చరిత్రను క్షణాల్లో వెలికితీసేందుకు కొత్త పరికరాలను రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలో పోలీస్‌శాఖకు “పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్” అనే సరికొత్త సాంకేతిక సాధనం కీలక ఆయుధంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ వ్యవస్థలో మార్పులకు ప్రాధాన్యం ఇస్తూ, ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా నేరస్థుల గుర్తింపు ప్రక్రియ మరింత వేగవంతమైంది. దొంగలు, పాత నేరస్థులు లేదా అనుమానితుల వేలిముద్రలను స్కాన్ చేస్తే, వారి గత నేర చరిత్ర మొత్తం కేవలం కొన్ని సెకన్లలోనే పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. అనుమానితులను గుర్తించడం, విచారణను వేగంగా ముందుకు తీసుకెళ్లడం సులభమైంది.
ఈ స్కానర్‌ను మొబైల్ ఫోన్లోని ప్రత్యేక యాప్‌తో అనుసంధానం చేసి ఉపయోగిస్తున్నారు. అనుమానితుడి బొటనవేలు లేదా చూపుడు వేలు స్కాన్ చేసిన తర్వాత, సంబంధిత వ్యక్తిపై నమోదైన కేసుల వివరాలు వెంటనే తెరపై కనిపిస్తాయి. ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి, ఎలాంటి నేరాల్లో పాల్గొన్నారు, రౌడీషీట్ ఉందా లేదా వంటి సమగ్ర సమాచారం అందుతుంది. ఒకవేళ ఎలాంటి నేర చరిత్ర లేకపోతే ‘నాట్ ఫౌండ్’గా చూపిస్తుంది.
నేరస్థులను గుర్తించేందుకు....
ఇంతకు ముందు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్థులను గుర్తించడం పోలీసులకు కష్టంగా ఉండేది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో దొంగలు జనాల్లో కలిసిపోయి తిరుగుతుండటంతో వారిని గుర్తించడం సవాలుగా మారేది. రాత్రివేళల్లో విధులు నిర్వహించే పోలీసులకు ఈ సమస్య మరింత క్లిష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ స్కానర్ అందుబాటులోకి రావడంతో ఆ సమస్యలకు గణనీయమైన పరిష్కారం లభించింది. ఈ పరికరం చిన్నదిగా, తేలికగా ఉండటం వల్ల పోలీసులు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఈ స్కానర్లను వినియోగంలోకి తీసుకువచ్చి, ఫీల్డ్ స్థాయిలో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల నేరాలను ముందుగానే అడ్డుకోవడం, నేరస్థులను వేగంగా అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతోంది. ఆధునిక సాంకేతికతను అస్త్రంగా మార్చుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేర నియంత్రణలో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నారు. పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి పరికరాలు కేవలం నేరస్థుల గుర్తింపుకే పరిమితం కాకుండా, పోలీసింగ్ విధానాన్ని మరింత వేగవంతం చేసి పారదర్శకతను పెంచుతున్నాయి. టెక్నాలజీతో బలపడుతున్న పోలీస్ వ్యవస్థ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంచుతుండగా, నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
