TDP: "ఏపీ హేట్స్‌ జగన్‌: పుస్తకం విడుదల

TDP: ఏపీ హేట్స్‌ జగన్‌: పుస్తకం విడుదల
TDP RELEASE JAGAN AP HATES JAGAN BOOK

అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను ప్రజలంతా ద్వేషిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పుస్తకం విడుదల చేసింది. దోచుకో, పంచుకో, తినుకో పదాలకు పేటెంట్ జగన్ రెడ్డిదేనని దుయ్యబట్టింది. తాను దోపిడీ చేస్తూ ఆ నెపం ఎదుటివారిపై వేయడంలో జగన్ సిద్ధహస్తుడంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఒక్కో కుటుంబంపై 8 లక్షల 25వేల రూపాయల భారం పడినట్లు లెక్కలతో సహా వెల్లడించారు. జగన్‌ని గద్దె దింపి రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ తెలుగుదేశం AP హేట్స్‌ జగన్‌ పేరిట ఓ పుస్తకం విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సీనియర్ నేతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు.


రాష్ట్రాన్ని లూటీ చేసి జగన్ 11 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగనేనని 'ది ప్రింట్ మ్యాగజైన్' పేర్కొనటాన్ని పుస్తకంలో ప్రస్తావించిన తెలుగుదేశం... భారతీ సిమెంట్స్, సండూర్ పవర్, సరస్వతీ పవర్, సాక్షి మీడియా లాంటి 16 భారీ కంపెనీలతో పాటు మరో 50కు పైగా బినామీ షెల్ కంపెనీలు ఆయనకు ఉన్నాయని తెలిపింది. వేల ఎకరాల భూములతో పాటు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇడుపులపాయ, పులివెందుల, తాడేపల్లిలలో ఇంద్ర భవనాలు లాంటి 6 ప్యాలెస్ లు ఉన్నాయని వివరించింది. 2004 లో కోటీ 73 లక్షల ఆస్తి కలిగి ఉన్న జగన్ 18 ఏళ్లలోనే 3 లక్షల కోట్లకు అధిపతిగా ఎదిగారని ఆ పార్టీ నేతలు గుర్తుచేశారు. సొంత బాబాయినే హత్య చేయించడంతోపాటు తల్లి, చెల్లిని ఇంటి నుంచి తరిమెయ్యడం పెత్తందారీ పోకడలు కాక మరేంటని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాలపై దాడి, భవనాలు కూల్చడం, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం పెత్తందారి విధానాలేనన్నారు. జగన్ రెడ్డిని మించిన పెత్తందారు, గజదొంగ దేశంలో మరెవరూ లేరని దుయ్యబట్టారు.

నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేయటంతోపాటు 30 వేల మంది ప్రాణాలు పోవటానికి జగన్మోహన్ రెడ్డి కారణమయ్యాడని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల భారం 64 వేల కోట్లు మోపటంతో పాటు ఉచిత ఇసుక విధానం రద్దుతో 125 వృత్తులు, వ్యాపారాల్ని దెబ్బతీసి, 30 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని పోగొట్టారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న జగన్‌రెడ్డికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక జగన్‌ను భరించలేమంటూ రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. 20 వేల ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవటంతోపాటు తన బినామీ విద్యుత్ కంపెనీల కోసం 75 వేల ఎకరాలు ఆదివాసీల భూములు కాజేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని మండిపడ్డారు.

Tags

Next Story