Andhra Pradesh : ఏపీలో నైట్ కర్ఫ్యూ .. మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ప్రభుత్వం..!

Andhra Pradesh : ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈరోజు నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ రోజు నుంచి జనవరి 31 వరకు రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆసుపత్రులు, మెడికల్ షాప్స్. డాక్టర్స్,మెడికల్ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, పెట్రోలు బంకులు, ఐటీ సేవలు, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఇచ్చింది.
వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారికి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ఇక కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ వేదికల్లో 100మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com