నివర్ తుఫాన్ : తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

నివర్ తుఫాన్ : తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

ప్రతీకాత్మక చిత్రం

నివర్ తుపాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికారణంగా చెన్నై నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీనుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. చెన్నైలో కురిసిన వర్షాలతో జనజీవనం అస్థవ్యస్తమైంది. లోతట్టుప్రాంతాలు జలమయం కావడంతో... అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తుపాన్ కారణంగా విమానాలు, రైళ్లు నిలిచిపోయాయి.

నివర్ తుపాన్ తమిళనాడు కడలూరికి తూర్పు ఆగ్నేయానికి 90 కిలోమీటర్ల దూరం, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది చెన్నైకి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుపాన్ రేపు తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో అతితీవ్ర తుపానుగా మారి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుపాన్ తీరాన్ని దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65నుంచి 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, దీనికారణంగా ఈ రాత్రి నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రేపు చిత్తూరు, కర్నూలు,ప్రకాశం, కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ ఎఫ్‌ బృందాలను సిద్దంచేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో తప్పిపోయి తెట్టుపేట దీవికి చేరుకున్నారు. 29మంది మత్స్యకారులు గత 10 గంటలుగా సహాయంకోసం ఎదురుచూస్తున్నారు. తమ వారిని కాపాడాలని మత్స్యకారుల బంధువులు కోరుతున్నారు. వారంతా షార్ గేట్ వద్ద సహాయంకోసం ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story