Kondapalli: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎవరు..? మరికాసేపట్లో..

Kondapalli (tv5news.in)

Kondapalli (tv5news.in)

Kondapalli: ఏపీ కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Kondapalli: ఏపీ కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ తీరుతో రెండుసార్లు వాయిదా పడ్డ ఎన్నిక. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ జరగబోతోంది. రెండురోజుల పరిణామాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు వైసీపీ, టీడీపీ క్యాంప్ రాజకీయం పోటాపోటీగా నడుస్తోంది. తమ అభ్యర్థుల్ని వైసీపీ MLA వసంత కృష్ణ ప్రసాద్ ప్రలోభ పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఇక మొదటిరోజు నుంచీ ఎంపీ కేశినేనిని టార్గెట్ చేస్తోంది అధికార వైసీపీ. నాని ఓటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో ఆఖరి నిమిషంలో ఎలాంటి ఎత్తులు వేస్తారోనన్న టెన్షన్ టీడీపీలో కనిపిస్తోంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మరి కాసేపట్లో మొదలుకాబోతోంది. వైసీపీ ఆగడాలకు చెక్ పెడుతూ ఎన్నిక నిర్వహించాల్సిందే అని హైకోర్టు ఆదేశించడంతో ఇవాళ ఎన్నిక జరుగుతోంది.

నిన్న తెలుగుదేశం పార్టీ వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలనే పాటించడం లేదంటూ మండిపడింది. వెంటనే తమ ముందు హాజరు కావాలని ఆదేశించడంతో.. మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ సీపీ, రిటర్నింగ్ ఆఫీసర్‌ ఆగమేఘాల మీద హైకోర్టుకొచ్చారు.

ఎన్నిక సందర్భంగా పరిణామాలు, వాయిదా వేయాల్సి వచ్చిన పరిస్థితులను కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరపు న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ గట్టిగానే వాదనలు వినిపించారు. వైసీపీ నేతలు సృష్టించిన విధ్వంసాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అరాచకాలకు అధికారులు సహకరిస్తున్నారని ధర్మాసనానికి తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఇవాళ మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నిక జరపాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ఫలితాన్ని ప్రకటించొద్దని.. వివరాలు తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఎన్నికైన అభ్యర్థులకు, పిటిషనర్లకు రక్షణ కల్పించాలంటూ విజయవాడ సీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతోనైనా అధికార పార్టీ నేతలు ఛైర్మన్‌ ఎన్నికకు సహకరిస్తారో లేదో అనేది చర్చనీయాంశంగా మారింది.

అధికారుల తీరును టీడీపీ తప్పు పడుతోంది. హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న ఎన్నిక అయినా.. అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. వైపీసీ సభ్యుల తీరుపై ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీడీపీ సభ్యులు ధైర్యంగా నిలబడ్డారన్నారు. హైకోర్టులో విచారణకు ముందు పెద్ద రచ్చే జరిగింది.

టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా వైసీపీ శ్రేణులు మన్సిపల్‌ ఛైర్మన్‌ కోసం చేయని ప్రయత్నాలు లేవు. అడ్డదారుల్లో గెలిచేందుకు సాక్షాత్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే వైసీపీ సభ్యులు కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ప్రతిపక్ష టీడీపీ ఎంపీ కేశినేని నాని, పార్టీ వార్డు సభ్కుల్ని భయబ్రాంతులకు గురిచేస్తూ.. సమావేశ హాలులోని కుర్చీలు, రిటర్నింగ్ అధికారి వేదికను ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా బల్లలు, టేబుళ్లను విరగ్గొడుతూ వీరంగం సృష్టించారు. మంగళవారం కూడా ఇదే తరహాలో వైసీపీ నేతలు రచ్చ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story