విశాల్ గౌతమ్: కోడికత్తి కేసులో ఎలాంటి కుట్ర లేదు..

కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని, క్షుణ్ణంగా దర్యాప్తు చేసినందున మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో ఇన్-కెమెరా పద్ధతిలో విచారణ సాగింది. ఈ అంశంపై లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ చేసిన అభ్యర్థనపై తాము ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశామని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది విశాల్ గౌతమ్ కోర్టుకు నివేదించారు. ‘ఘటనపై దర్యాప్తు ముగిశాక, కేసు విచారణ ప్రారంభమైన దశలో హఠాత్తుగా మళ్లీ లోతైన దర్యాప్తు డిమాండ్ తీసుకురావడం సహేతుకం కాదని ఘటనకు సంబంధించి సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించామని వీటి ప్రకారం శ్రీనివాసరావు ఒక్కడే నిందితుడని తేలిందని కుట్ర కోణం ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని ఆయన వాదించారు.
నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం సైతం లోతైన దర్యాప్తు కోసం వేసిన పిటిషన్‌ను అనుమతించొద్దని కోరారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిందితుడు అయిదేళ్లుగా రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్నారన్నారు. మళ్లీ దర్యాప్తునకు ఆదేశిస్తే నిందితుడికి న్యాయం ఆలస్యం అవుతుందన్నారు. సీఎం జగన్, ఎన్‌ఐఏ, నిందితుడి తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో తీర్పును న్యాయమూర్తి ఏ.సత్యానంద్ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.సామాన్యులకు కూడా న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోడికత్తి కేసు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు కోరారు. తన ఆవేదనను అక్షరబద్ధం చేసి ప్రజలకు ఆయన లేఖ రాశారు. దీనిని అతని తరఫు న్యాయవాది సలీం విడుదల చేశారు. తమది నిరుపేద కుటుంబమని లేఖలో శ్రీనివాసరావు వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com