Gudlavalleru: హాస్టల్లో రహస్య కెమెరాలు అవాస్తవం

Gudlavalleru:  హాస్టల్లో రహస్య కెమెరాలు అవాస్తవం
కాలేజీలోని సెంట్రల్ సర్వర్‌, హాస్టళ్లు, విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించినట్టు తెలిపిన ఐజీ అశోక్

ఏపీలోని కృష్ణాజిల్లాలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని బాలికల వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టి భారీ ఎత్తున వీడియోలు చిత్రీకరించారన్న వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనిపై బాలికలు వారం రోజుల పాటు ఆందోళన కూడా చేపట్టారు. దీనిపై పోలీసులు ప్రాధమికంగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చినా వారి తల్లితండ్రులు సంతృప్తి చెందకపోవడంతో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తో సాంకేతిక దర్యాప్తు చేయించారు. ఈ రిపోర్ట్ తాజాగా ప్రభుత్వానికి అందింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్ రూములలో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు తీశారన్న ఆరోపణలపై కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దర్యాప్తులో తేలిన అంశాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన వెల్లడించారు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించామని అశోక్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నవారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకొని మూడు రోజులపాటు పరిశీలన, దర్యాప్తు చేశామని ఆయన చెప్పారు. కాలేజీలోని సెంట్రల్ సర్వర్‌తో పాటు హాస్టళ్లను, విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించామని అశోక్ కుమార్ వివరించారు. వివరాలు అన్నింటినీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నామని, 5 రోజుల్లో వివరాలు అందుతాయని ఐజీ పేర్కొన్నారు. సాక్ష్యాలతో ఎవరైనా ముందుకొస్తే దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఎస్పీ గంగాధర్‌‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్టూడెంట్ సంఘాల వారంతా అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారని, ఎటువంటి ఆధారాలు ఇవ్వలేకపోయారని ఐజీ అశోక్ కుమార్ వివరించారు. వారం రోజులపాటు సాగిన దర్యాప్తులో హిడెన్ కెమెరాల ఏర్పాటు, వీడియోల షేరింగ్‌ జరగలేదని నిర్ధారణ అయిందని అన్నారు. కాగా హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలను అమ్ముకున్నారంటూ ఆగస్టు 29న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు నిరసనకు దిగారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

Tags

Next Story