PROTEST: బెదరొద్దు.. భయపడొద్దు.. వెనకడుగు వేయ్యొద్దు

ఎలాంటి ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకోకుండా, విచారణ లేకుండా చంద్రబాబును నిర్బంధించారని ధ్వజమెత్తారు. ఏం తప్పు చేశారో ఇప్పటికీ నిరూపించలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో తెలుగుదేశం చేపట్టిన దీక్షలకు భువనేశ్వరి మద్దతిచ్చారు. బాబు కోసం నేను సైతం అంటూ నినదించారు. ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోకుండానే చంద్రబాబును జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్డెక్కుతున్న వారిపై పోలీసుల ఆంక్షలు దారుణమని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై కూడా కర్కశంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే మహిళలకు రక్షణ ఉంటుందని పునరుద్ఘాటించారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని భువనేశ్వరి ఆక్షేపించారు. ప్రజల కోసం పోరాడటం.... తప్పా అని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు పన్నినా యువగళాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
రాజమండ్రిలోని జాంపేటలోని సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చిలో నారా భువనేశ్వరి ప్రార్థనలు చేశారు. చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలంటూ ప్రార్థించారు. బాబు త్వరగా బయటకు వచ్చి ప్రజా సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేసిన పాస్టర్లు భువనేశ్వరిని ఆశీర్వదించారు. తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబుకు బిడ్డల్లాంటివారన్న భువనేశ్వరి, ఆయన కుటుంబ పెద్దని తెలిపారు. ఎవరి కుటుంబ పెద్దనైనా హింసించి జైలులో పెడితే బిడ్డలు ఊరుకోరని... అందుకే నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. మహిళలను కూడా వ్యానుల్లో ఎక్కించి, పోలీసుస్టేషన్లలో పెడుతున్నారని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక స్ర్తీనే అని ఈ ఘటనలు మర్చిపోలేనని భువనేశ్వరి అన్నారు. తనపై రకరకాల మాటలతో దాడి చేసినా భయపడలేదని.. పనిలేనివాళ్లు ఏమనుకున్నా పట్టించుకోనవసరం లేదన్నారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని, మన గురించి మనకు తెలుసని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజలు, మహిళలు చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారని... మీ పోరాటాన్ని మేం మర్చిపోలేమని భువేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. కుప్పంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై తప్పుడుకేసులు బనాయించారని, పోలీసులకు వారి విధులు తెలియవా... ప్రభుత్వం ఏం చెపిబితే అదే చేయడం దారుణం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చేయిచేయి కలిపి చంద్రబాబుకు మద్దతుగా ఉందామని... కలసి పోరాడదామని.... ఎవరూ బెదరవద్దు. భయపడవద్దు అని భువనేశ్వరి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com