AP: సమీపిస్తున్న గడువు... పెరిగిన నామినేషన్లు

AP: సమీపిస్తున్న గడువు... పెరిగిన నామినేషన్లు
మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ నామినేషన్లు దాఖలు.... ఎన్‌డీఏ నేతల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన ప్రజలు

నామినేషన్ దాఖలు గడువు చివరి దశకు చేరడంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా నామినేషన్ల జోరు కొనసాగింది. ఎన్డీయే ఉమ్మడి అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు వేశారు. మచిలీపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లురవీంద్ర, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి భారీ ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు అందజేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్‌కు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆర్వో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.

పల్నాడు జిల్లా వినుకొండలో కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ర్యాలీకి ముందు వినుకొండలోని పాతశివాలయం, గుంటి ఆంజనేయులు దేవాలయాలు, చర్చిలో జీవీ ఆంజనేయులు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనల అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్‌ వేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్‌రావు నామినేషన్ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా డీజే సౌండ్‌బాక్సులు పెట్టినా.. పోలీసులు పట్టించుకోలేదు. పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ నామినేషన్ సందర్భంగా విచ్చలవిడిగా డబ్బు పంచారు. విజయవాడ తూర్పులో వైసీపీ తరఫున దేవినేని అవినాష్‌ నామినేషన్ వేశారు.


కృష్ణా జిల్లా పామర్రులో కూటమి తెలుగుదేశం అభ్యర్థిగా వర్ల కుమార్‌రాజా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలివచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వర్ల కుమార్ రాజా కోరారు. ఒంగోలులో కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ నామినేషన్ సందర్భంగా K.పల్లిపాలెం నుంచి ఒంగోలు వరకు మత్స్యకారులు 20 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. అనంతపురంలో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. విశాఖ పశ్చిమలో టీడీపీ అభ్యర్థి గణబాబు తన నివాసం నుంచి జ్ఞానపురం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కడపలో తెలుగుదేశం అభ్యర్థి మాధవి... ఆమె స్వగృహం నుంచి పెద్దఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. బద్వేలులో కూటమి అభ్యర్థి రోషన్న నామినేషన్ వేశారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం, కార్యకర్తలు తరలివచ్చారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నామినేషన్ సందర్భంగా పట్టణం పసుపుమయంగా మారింది. కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి, జమ్మలమడుగు భాజపా అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందులలో భారీ ర్యాలీగా తరలివచ్చి బీటెక్ రవి నామినేషన్ వేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తెలుగుదేశం అభ్యర్థి ముత్తముల అశోక్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా పట్టణంలో కోలాహలం నెలకొంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు నామినేషన్‌కు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story