22 Sep 2022 2:06 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / NTR Health University...

NTR Health University : హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ కుటుంబం ఫైర్..

NTR Health University : విజవాయడలోని హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి... వైఎస్‌ పేరు పెట్టడంపై ఏపీలో దుమారం రేగుతోంది

NTR Health University : హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ కుటుంబం ఫైర్..
X

NTR Health University : విజవాయడలోని హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి... వైఎస్‌ పేరు పెట్టడంపై ఏపీలో దుమారం రేగుతోంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఎన్టీఆర్‌ను అవమానించారంటూ.. ఇప్పటికే టీడీపీ... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. జగన్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతోంది సీనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబం. ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు నందమూరి రామకృష్ణ.

హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, 1986లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారని గుర్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో డాక్టర్.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేశారని, ఆ పేరును‌ జగన్ మార్చడం దురదృష్టకరమని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరును తొలగించటం తెలుగు జాతిని అవమానించినట్లేనని, హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

వైఎస్‌ పేరు పేరు ఎందుకు మార్చవలసి వచ్చిందో ప్రభుత్వం చెప్పాలన్నారు ఎన్టీఆర్‌ కుమార్తే, బీజీపీ నేత పురంధేశ్వరి. ఎన్టీఆర్‌ కూతురిగా అడుగుతున్నానంటూ ప్రభుత్వాన్ని నిలదీశారామె. వైఎస్సార్‌ డాక్టర్‌ అయితే.. ఎన్టీఆర్‌ సామాజిక డాక్టర్‌ అన్నారు. అన్ని పథకాలకు ఎన్టీఆరే ఆద్యుడన్నారు. వైఎస్సార్‌పై తమకు అభిమానం ఉందని.. అయితే ఎన్టీఆర్‌ హయాంలో కట్టిన హెల్త్‌ యూనివర్సిటీకి ఇప్పుడు పేరు మార్చే పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలన్నారు ప్రశ్నించారు దగ్గుబాటి పురంధేశ్వరి.

ఎన్టీఆర్‌ కుటుంబమంతా... సీఎం జగన్‌ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా.. ఎన్టీఆర్‌ మనవడు, టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం చాలా డిప్లమాటిక్‌గా స్పందించారు. ఒకరి పేరు తీసి... మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదని, అలాగే ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌, వైఎస్‌లు ఇద్దరూ విశేష ప్రజాధరణ పొందిన నేతలన్నారు. వర్సిటీకి పేరు మార్పుతో ఎన్టీఆర్‌ సంపాదించుకున్న కీర్తిని, వారి స్థాయిని..తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్నవారి జ్ఞాపకాలను చెరిపివేయలేరంటూ ట్వీట్‌ చేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌. కర్ర విరగుకుండా... పాము చావకుండా.. అన్నట్లు జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు.

రాజకీయ కారణాలతో మహనీయుల పేర్లు మార్చడం హుందాతనం కాదన్నారు నారా రోహిత్‌. ఎన్టీఆర్‌ స్థాయిలో మరొకరు లేరు, రారున్నారు. ఆయన పేరు మార్చాలంటే.. తిరిగి ఆయన పేరే పెట్టాలన్నారు. ఇలాంటి పనులతో మీ స్థాయి దిగిజారుతోంది తప్పితే... ఆయన స్థాయికి ఏమీ కాదన్నారు నారా రోహిత్‌.

మొత్తానికి... హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడంతో.. రగడ రాజుకుందా. నందమూరి కుటుంబమంతా.. జగన్‌ నిర్ణయాన్ని తప్పుపట్టగా... జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం... నొప్పించక, నావ్వొక అన్న రీతిలో స్పందించారంటూ మండిపడుతున్నారు.

Next Story