AP: ఆయిల్ ఫ్యాక్టరీల వ్యర్ధాలతో కాకినాడ

AP:  ఆయిల్ ఫ్యాక్టరీల వ్యర్ధాలతో  కాకినాడ
వ్యర్ధ జలాలు సమస్యలపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం మాత్రం లేదు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీల వ్యర్ధాలతో కాలుష్యం పెరిగిపోతోంది. ఈ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణానికి చేటు కలిగడమే కాకుండా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని పెద్దాపురం ఐడిఏ పరిధిలో ఉన్న ఓ ప్రముఖ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ విడుదల చేసే వ్యర్థ జలాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లాది రూపాయల టర్నోవర్ కలిగిన ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలు పంట పొలాలకు చేరి నష్టాన్ని చేకూరుస్తున్నాయి.

అంతేకాకుండా ఈ వ్యర్ధ జలాలు అనేక కిలోమీటర్లు దూరంలో ఉన్న వేట్లపాలెం గ్రామంలోకి చేరుకుని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వేట్లపాలెం డ్రేయిన్ ద్వారా చెంతనే ఉన్న సామర్లకోట ప్రధాన కెనాల్ లోకి.... ఈ వ్యర్థాలు విడుదల కావడంతో నీరు పూర్తిగా కలుషితవుతోంది. ఈ కెనాల్ ద్వారా వచ్చే నీటి పైనే సామర్లకోట , పెద్దాపురం మున్సిపాలిటీ త్రాగునీటి పథకాలు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ భారీ త్రాగునీటి రక్షిత పథకాలు ఆధారపడ్డాయి. ఈ నీటి కాలుష్యంతో లక్షలాదిమంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ ఫ్యాక్టరీ విడుదల చేసే వ్యర్ధ జలాలు సమస్యలపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం మాత్రం లేదు.

పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు రావడంతో ఇటీవలే తనిఖీలు చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్య కారకాలు గా కొనసాగుతున్న పలు అంశాల పై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కోట్లాది రూపాయలు ఫైన్ వేశారు. అయితే... కేవలం 87 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది నిబంధనల్ని ఈ ఫ్యాక్టరీ ఎలా కాలరాస్తున్నారన్నది.

కాలుష్య నియంత్రణ మండలి సూచించిన చర్యల్లో భాగంగా చేపట్టిన ఎం ఈ ఈ ప్లాంట్ గడువు ముగిసి నెలలు గడుస్తున్నా ఈ ప్లాంట్ నిర్మాణం మాత్రం నత్త నడకన కొనసాగుతున్నాయి. ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాని పరిస్థితి. దీంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేట్లపాలెం గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ కంపెనీ ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోకుండా అలానే ఉండిపోయాయి. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.

ఈ ఆయిల్ ఫుడ్స్ ఇండస్ట్రీ పై ఆధారపడ్డ ఆయిల్ పామ్ రైతాంగానికి సంబంధించి ఎలాంటి సదుపాయాలు లేకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతం లో ఉన్న యాజమాన్యం..ఆయిల్ పామ్ రైతుకు పొలం లో అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైతే ఆర్థిక సహాయం అందించేది. కానీ ఇప్పుడున్న యాజమాన్యం రైతుకు ఏ మాత్రం భరోసా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అంతే కాకుండా నష్టాల బాటలో ఉన్న ఆయిల్ పామ్ రైతాంగానికి అండగా ఉండేలా మొక్కలు , ఎరువులు రాయితీ ల పై గతంలో ఉండే విధంగా అందించి సహకరించాలని ఆయిల్ పామ్ రైతాంగం కోరుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ కాకినాడ జిల్లా పెద్దాపురం ఐడిఏ పరిధిలో ఉన్న ప్రముఖ ఆయిల్ పుడ్స్ కంపెనీ కార్యకలాపాల వలన జరుగుతున్న నష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించి... ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story