Tirumala Rain : తిరుమలలో భారీ వర్షం.. ఒకటి, రెండో ఘాట్ రోడ్డులు మూసివేత

Tirumala Rain : తిరుమలలో భారీ వర్షాలతో టీటీడీ అధికారులు అలెర్ట్ అయ్యారు. తిరుమల ఒకటి, రెండో ఘాట్‌రోడ్డులను మూసివేశారు. ఎడతెరిపిలేని వర్షాలు, భారీ గాలులతో ఘాట్‌రోడ్డులోని చెట్లు విరిగిపడుతున్నాయి. తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మార్గాన... మొదటి ఘాట్ రోడ్డు రెండో మలుపు వద్ద కొండ చరియలు విరిపడ్డాయి. దీంతో టీటీడీ అధికారులు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు.. రెండు ఘాట్ రోడ్డులను మూసివేశారు. ఎక్కడిక్కడ టోల్‌గేట్లను సైతం బంద్ చేశారు.
అటు తిరుమల కొండపైన వాన నీటితోఆలయ మాడ వీధులు జలమయం అయ్యాయి. కుండపోత వానలతో పాపవినాశనం, గోగర్భం డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. మరోవైపు ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోనూ ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలతో తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. ఇప్పటికే తిరుపతిలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ తెలిపింది. అటు మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో...తిరుపతి వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com