Andhra Pradesh :పట్టు వీడని జగన్ ప్రభుత్వం.. మెట్టు దిగని థియేటర్ల ఓనర్లు.. !

Andhra Pradesh : ఏపీలో సినిమా ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయాలని జగన్ సర్కారు చూస్తోంది. కానీ.. ప్రభుత్వ నిర్ణయంపై థియేటర్ల ఓనర్లు, టాలీవుడ్ పెద్దలు మాత్రం అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. దాంతో ఏపీలో ఆన్‌లైన్ టికెట్ విధానంపై తీవ్ర గందరగోళం నెలకొంది.
జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు సామాన్య ప్రజల్లోనూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతించడం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం, సినిమా టికెట్ల ధరలను నియంత్రించడం, ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలంటూ ఇటీవల చిరంజీవి ట్వీట్ చేశారు.
పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానం తీసుకురావడాన్ని స్వాగతించిన మెగాస్టార్.. దేశమంతా ఒకటే జీఎస్టీ ఉన్నప్పుడు.. టికెట్ల ధరలూ అలాగే ఉంటే బాగుంటుందన్నారు. తగ్గించిన టికెట్ల రేట్లు కాలనుగుణంగా మిగతా స్టేట్స్‌లో ఉన్నట్టే నిర్ణయిస్తేనే పరిశ్రమకు మేలు జరుగుతుందని తెలిపారు. సినిమాపై ఆధారపడిన ఎన్నో కుటుంబాల కోసం టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు కల్పించడంపై ప్రభుత్వం పునరాలోచించాలని చిరంజీవి కోరారు.
ఇటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం సినిమా టికెట్ల ధరల అంశాలపై కీలక ప్రకటన చేశారు. నటులు, దర్శకులు, నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వ నిర్ణయంతో చాలా మంది తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ వల్ల దోపిడీ ఆగిపోతుంది అనడం సరైంది కాదన్న రాఘవేంద్రరావు.. ప్రభుత్వమే న్యాయం చేయాలని లేఖలో స్పష్టంచేశారు. చిరంజీవి, రాఘవేంద్రరావు బాటలోనే మరికొందరు ఒక్కొక్కరుగా మాట్లాడే అవకాశం లేకపోలేదు.
ఇక.. ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో కొన్ని సినిమాల రిలీజ్ ఎప్పుడనేది తేలడం లేదు. పెద్దపెద్ద సినిమాలు సైతం.. షూటింగ్‌లు పూర్తి చేసుకుని.. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే డిసెంబర్ 2న విడుదలవుతున్న అఖండ సినిమా ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న అఖండ మూవీ.. ఏపీలోనూ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.
ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో థియేటర్ల యజమానులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు అదనపు షోలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే టికెట్ల ధరలు పెంచి అమ్మకాలు సాగిస్తున్న వైనం కూడా కనడుతోంది. ప్రభుత్వం అడ్డుకుంటే థియేటర్లు మూసివేయడానికి కూడా వెనకాడబోమని థియేటర్ యజమానులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కరోనా కంటే ప్రమాదకరంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనవరిలో ఇప్పటికే రిలీజ్ డేట్‌లు ప్రకటించుకున్న సినిమాల విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ చూపంతా ఇప్పుడు అఖండ సినిమాపైనే ఉంది. ఏపీలో అఖండ కలెక్షన్లపైనే థియేటర్ల భవితవ్యం ఆధారపడినట్లుగా స్పష్టమవుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఎలాంటి బెనిఫిట్ షోలు కానీ, అదనపు షోలు కానీ లేకుండా ఈ భారీ బడ్జెట్ సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది. మారిన పరిస్థితుల్లో సరైన కలెక్షన్లు రాకపోతే ఓటీటీ వైపు వైపు సినిమా పరిశ్రమ దృష్టిపెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.
అటు భారీ బడ్జెట్ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫ్యాన్సీ ఆఫర్‌తో ఊరిస్తున్నాయి.. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మూవీకి ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లుగా సినిమా వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి జగన్ సర్కారు ఆన్‌లైన్ విధానంతో ఇటు చిత్ర పరిశ్రమ.. అటు థియేటర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com