AP: పేదరికం లేని సమాజ స్థాపనే "పీ4" లక్ష్యం

ఏపీలో నవ శకానికి నేడు నాంది పడనుంది. అమరావతి వేదికగా ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పీ-4 కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కార్మికులను ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకురానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేయడం, సంపన్నులు - పేదలను ఒకే వేదికపైకి తీసుకురావడం పీ-4 విధానానికి ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగి, సమాన అవకాశాలు పొందే విధంగా ఈ పథకాన్ని రూపొందించామని ఆయన తెలిపారు.
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి
ప్రవాసాంధ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకునేలా ఈ పీ 4 విధానం రూపొందించారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు భరోసా కల్పించే ఈ విధానం, రాష్ట్ర ఆర్థిక స్థితిని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. పథకం అమలులో సహాయపడే వ్యక్తులను ‘మార్గదర్శులుగా’, ప్రయోజనం పొందే కుటుంబాలను ‘బంగారు కుటుంబాలుగా గుర్తిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్వచ్ఛందంగా సహాయపడే మార్గదర్శులు, ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా సహకరించనున్నారు. పేదవారిని ఆర్థిక సామాజిక రంగాల్లో తీసుకొచ్చే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోంది. పేదలను ధనికులను భాగస్వామ్యం చేసేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంది.
భారీగా ఏర్పాట్లు
సచివాలయం సమీపంలో పీ-4 కార్యక్రమం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీ-4 ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. అన్ని నియోజకవర్గాల నుంచి పేదలు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎండల దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com