TDP: పూర్తయిన ధూళిపాళ్ల పాదయాత్ర

TDP: పూర్తయిన ధూళిపాళ్ల పాదయాత్ర
వైసీపీని సాగనంపితేనే సహజ వనరుల దోపిడీ ఆగుతుంది... అధికార పార్టీపై నిప్పులు చెరిగిన తెలుగు దేశం నేతలు....

వచ్చే ఎన్నికల్లో వైసీపీని సాగనంపితేనే ఆంధ్రప్రదేశ్‌లో సహజవనరుల దోపిడి ఆగుతుందని తెలుగుదేశం నేతలు అన్నారు. గుంటూరు జిల్లాలో మట్టి, గ్రావెల్ దోపిడీని నిరసిస్తూ ధూళిపాళ్ల నరేంద్ర తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో 2రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఇందులో పాల్గొన్న ఆ పార్టీ ముఖ్యనేతలు అధికార పార్టీ నేతల దోపిడీని ఎండగట్టారు. 2వేల కోట్ల విలువైన మట్టిని కొల్లగొట్టారని.. ఇందులో సీఎం జగన్‌కు వాటా ఉందని విమర్శించారు.


గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో సహజవనరుల దోపిడీని నిరసిస్తూ ప్రజాపోరుబాట పేరిట మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన పాదయాత్ర పూర్తైంది. 2 రోజుల పాటు 24 కిలోమీటర్ల మేర జరిగిన పాదయాత్ర ..గ్రావెల్ క్వారీల గుండా సాగింది. చేబ్రోలు మండలంలో 7 గ్రామాల పరిధిలో మట్టిదోపిడి జరిగిన ప్రాంతాలను నరేంద్ర స్థానికులతో కలిసి పరిశీలించారు. అక్రమ తవ్వకాల వల్ల తలెత్తిన ఇబ్బందులను నరేంద్ర ముందు వారు ఏకరవు పెట్టారు. గ్రామాల్లో రోడ్లు పాడయ్యాయని క్వారీ గుంతల్లో పడి పిల్లలు చనిపోయారని వివరించారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. గ్రామాల్లో పర్యావరణ విధ్యంసాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగిన నరేంద్ర బుధవారం శేకూరులో బహిరంగసభలో పాల్గొన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలకు ఈ దోపిడీలో వాటా ఉందని ఆరోపించారు.

పాదయాత్ర ముగింపు సభలో తెదేపా సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. వైకాపా నేతలు 2వేల కోట్ల రూపాయలకు పైగా మట్టి,గ్రావెల్ దోపిడీ చేశారని ఆరోపించారు. MLA కిలారి రోశయ్య సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. వారి అక్రమాలు బయటపెడుతున్నారన్న కక్షతోనే నరేంద్రపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు దోపిడీ దారులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సహజ వనరుల దోపిడీని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని తెదేపా నేత నరేంద్ర యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇప్పటికే కోర్టులో ఉన్నందున అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story