AP: పల్లె పండుగ వారోత్సవాలకు సర్వం సిద్ధం

AP:  పల్లె పండుగ వారోత్సవాలకు సర్వం సిద్ధం
X
13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లెపండుగ వారోత్సవాలు .. కంకిపాడులో వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్

ఏపీవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించనున్నారు. 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లెపండుగ వారోత్సవాలు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. సీసీ రోడ్లతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్లతో 30 వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. మొత్తం 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం లాంటి పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది.

కీలక లక్ష్యాలను చేరుకునేందుకే..

గ్రామీణ కుటుంబాలకు నివాసం ఉంటున్న గ్రామాల్లో ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించటం, సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసి జీవనోపాధులు మెరుగు పరచటం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా ఉపాధి వేతనదారులకు కల్పించిన హక్కులను అమలు చేయాలన్నారు. పని కోరిన 15 రోజులలో పని పొందే హక్కు, లేని పక్షంలో నిరుద్యోగ భృతి, పని ప్రదేశం నివాసానికి 5 కి.మీ.కంటే దూరం ఉంటే రోజూ కూలీకి అదనంగా 10 శాతం వేతనం, పని ప్రదేశాల్లో ప్రథమచికిత్స, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతన రేటు రూ.300 ఇవ్వడం, పని ప్రదేశంలో కూలి మరణించినా, పూర్తిగా అంగవైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి రూ.50,000 నష్ట పరిహారం వంటి హక్కులను వారికి అందించాలని అధికారులకు పవన్ సూచించారు.

ఇప్పటికే విజయవంతంగా గ్రామసభలు

ఈ ఏడాది ఆగస్ట్‌ 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో మునుపెన్నడూ లేని విధంగా అందరి సహకారంతో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించామని పవన్ గుర్తు చేశారు. ఇందుకుగాను వరల్డ్‌ రికార్డ్‌ అవార్డు అందుకున్నామన్నారు. ఉపాధి హామీ పథకంలో మే 20వ తేదీ నుంచి పెండిరగ్‌ ఉన్న కూలీల వేతనాలను రూ. 2081 కోట్లను చెల్లించాం. ఉపాధి హామీ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సరిపడా రూ.4500 కోట్ల రూపాయల పనులకు గ్రామ సభల ఆమోదం తీసుకున్నామన్నారు. గ్రామసభల తీర్మానాల ఆధారంగా ఉపాధి హామీ పథకం కింద ఇప్పటివరకు 26,715 పనులకు 2,239 కోట్ల రూపాయలకు జిల్లా కల్లెక్టర్లు పరిపాలనా ఆమోదం ఇచ్చారు. పల్లె పండుగ కార్యక్రమంలో రూ.4,500 కోట్ల నిధులతో 30 వేల పనులకు శ్రీకారం చుడతామని పవన్‌ అన్నారు.

Tags

Next Story