PAWAN: జగన్‌కు ఉన్న రాజ భవనాలు సరిపోవా..?
ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న రాజ భవనాలు సరిపోవని రుషికొండలో కొండను తొలిచేసి మరో ప్యాలెస్ కట్టారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి విలాసాలకు ఖర్చు చేసిన 451 కోట్ల రూపాయలతో మరో ఫిషింగ్ హార్బర్ కట్టవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జెట్టీ కూడా సరిగా లేదని పవన్ మండిపడ్డారు. ఏపీలో తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వచ్చాక గుజరాత్ తరహాలో జెట్టీలు కడతామని చెప్పారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన మత్య్సకారులను ఆయన పరామర్శించారు. 49 మంది మత్య్సకారులకు 50 వేల చొప్పున ఆర్థికసాయం చేశారు. బోటు విలువలో 80 శాతం పరిహారం ఇస్తామన్న వైకాపా ప్రభుత్వం ఇచ్చిందా అని పవన్ ప్రశ్నించారు. రుషికొండలో సీఎం జగన్ ఖర్చు చేసిన డబ్బుతో మరో ఫిషింగ్ హార్బర్ కట్టవచ్చని పేర్కొన్నారు. మరో 4 నెలల్లో వైకాపా సర్కార్ ఉండదని తర్వాత మత్స్యకారులు సహా ఏపీలో అందరికీ మంచి రోజులు వస్తాయని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
తాను ఎప్పుడు ఆంధ్రాలో అడుగు పెడదామనుకున్నా అడ్డంకులు సృష్టిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు వస్తుంటే తన కార్యక్రమం రద్దయిందని... తాను రావట్లేదని ఓ ఆంధ్రా ఇంటెలిజెన్స్ అధికారి సమాచారం ఇచ్చారన్నారు. బుక్ చేసుకున్న విమానాన్ని వెనక్కి పంపేశారని మండిపడ్డారు. జనసేన అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. నష్టపోయిన బోట్ల యజమానులకు 15లక్షలు ఇస్తామని చెప్పి 7లక్షలు చేతిలో పెట్టారని... మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్తోందని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా మత్స్యకారులను మోసగిస్తోందని పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. హార్బర్‌లోనూ, ఏపీలోనూ వైసీపీ దోపిడీ ఎక్కువైందని పవన్ ధ్వజమెత్తారు. 150 కోట్లతో జెట్టీలను ఆధునికీకరిస్తామని చెప్పి కనీసం దీపాలూ ఏర్పాటు చేయలేదన్నారు.
అధిక తీరప్రాంతం ఉండి కూడా రాష్ట్రంలో ఒక్క జెట్టీ కూడా సరిగా లేదన్నారు. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వచ్చాక గుజరాత్‌లా ఇక్కడా జెట్టీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌కు ఉన్న ఇళ్లు సరిపోక రుషికొండలో కొండను తవ్వేసి మరో ప్యాలెస్ కట్టారని... పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. సంపద మొత్తం జగన్ కుటుంబానికే కాకుండా వెనుకబడిన కులాలన్నింటికీ చేరాలనేదే తన ఆకాంక్ష అని పవన్‌కల్యాణ్ అన్నారు. మనస్ఫూర్తిగా మత్స్యకారులు తనను నమ్మాలని న్యాయం జరిగేవరకూ వారికి అండగా నిలబడతానని పవన్ భరోసా ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com