Chandrababu: సర్దుబాట్లు కొలిక్కి వచ్చినట్లేనా

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం ప్రత్యర్థి పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో తెలుగుదేశం- జనసేన సైతం తుది కసరత్తు చేపట్టాయి. పొత్తులో భాగంగా సీట్ల ఖరారు. అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి. ఈమేరకు చంద్రబాబు నివాసానికి రెండుసార్లు వచ్చిన పవన్...అర్ధరాత్రి వరకు సీట్ల మథనం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలుకావటంతో ప్రధాన ప్రతిపక్ష కూటమికి చెందిన తెలుగుదేశం-జనసేన సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచాయి. ఆదివారం చంద్రబాబుతో రెండు దఫాలుగా సమావేశమైన పవన్ కల్యాణ్ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి? సామాజిక సమీకరణలు, సీటు దక్కనివారికి ఎలా సర్దుబాటు చేయాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గతనెల 13న సంక్రాంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. మూడున్నర గంటలు జరిగిన ఆ విందుభేటిలో పొత్తుకు సంబంధించిన చాలా అంశాలపై స్పష్టత వచ్చింది. నాటి చర్చలకు కొనసాగింపుగా ఆదివారం ఇరువురు నేతలు మళ్లీ భేటీ అయ్యారు. గత సమావేశంలో లోకేశ్, మనోహర్ పాల్గొనగా ఈసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే చర్చలు జరిపారు. మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్ దాదాపు 3 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మరోసారి చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ సుమారు 40 నిమిషాలకుపైగా సీట్ల కేటాయింపు, సర్దుబాటపై చర్చించారు. ఈనెల 8న మరోసారి సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు ఎన్నికలప్రచార వ్యూహాలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు కలిసి పాల్గొనాల్సిన బహిరంగ సభలపై నిర్ణయం తీసుకోనున్నారు.
అంతేకాదు రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి ని బరిలోకి దింపడంపైనా ఎల్పీ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజా సమస్యలు, ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని అంశాల్ని సభలో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కావడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే సభలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగం ఉంటుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతండటంతో సమావేశాలు మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com