PAWAN: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం

PAWAN: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం
వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే... ఎన్నికుయుక్తులు పన్నినా జగన్‌ మా విజయాన్ని ఆపలేడు

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ కలిసి వచ్చే ఎన్నికల్లో తమ కూటమి విజయభేరి మోగిస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. తమ పోరాటంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ దుష్టపాలన అంతమవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 38 కేసుల్లో దోషిగా ఉన్న జగన్‌ రాజకీయాలకు అనర్హుడని ధ్వజమెత్తారు. లక్ష కోట్లు తినేశాడని తెలిసీ జగన్‌కు ఓటేసి గెలిపించడం అతి పెద్ద పొరపాటన్నారు. అదే ఏపీకి శాపంగా మారిందని విమర్శించారు. ఇంత కంటే చీకటి రోజులు వద్దన్నారు.


2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయని పవన్ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఈ కూటమికి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారాహి నాలుగో విడత యాత్రలో భాగంగా పెడనలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్‌, వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఎన్ని కుతంత్రాలు చేసినా.. కుయుక్తులు పన్నినా తమ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్‌ పాలనలో ఎదుర్కొంటున్న చీకటిరోజులు మళ్ళీ రాకూడదంటే టీడీపీ-జనసేన ప్రభుత్వ స్థాపనే ఏకైక మార్గమని తేల్చి చెప్పారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పవన్‌ మండిపడ్డారు. రూపాయి పావలా ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు.


ప్రతి పనికీ ఎమ్మెల్యేలు రేట్లు పెట్టి దోచుకుంటున్నారని పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. 151మంది ఎమ్మెల్యేలు, 22మంది ఎంపీలను గెలిపిస్తే అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులపై జగన్ కేసులు పెడుతున్నారని పవన్ విమర్శించారు. చివరకు మాజీ సీఎం చంద్రబాబును కూడా జైలులో పెట్టే పరిస్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో 3లక్షలకు పైగా కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌ను విడిచి వెళ్లిపోయాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 3లక్షల మంది పిల్లలు పాఠశాలలకు రాకపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అడ్డగోలుగా అరాచకం సాగిస్తున్న జగన్‌ను ఖచ్చితంగా గద్దె దింపాల్సిందేనన్న పవన్ ...ఓటు అనే తిరుగుబాటుతో వైసీపీని శాశ్వతంగా మళ్లీ రాకుండా చేయాలని పిలుపునిచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కేటాయించిన వైద్య కశాశాలల సీట్లు కూడా జగన్‌ అమ్ముకుంటున్నారని పవన్‌ ఎద్దేవా చేశారు. ఇలాంటి పాలన పోవాలంటే వచ్చే పదేళ్లు టీడీపీ- జనసేనకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరి భవిష్యత్తు కోసం టీడీపీతో కలసి ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తామని స్పష్టం చేశారు. 28 లక్షల ఇళ్లు కడతామని 3 లక్షల ఇళ్లే కట్టారన్న పవన్‌... అయిదేళ్ల పాలనలో ఇళ్ల నిర్మాణానికి రూ.43 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి రూ.8,258 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో అత్యధిక అవినీతి జరిగింది వైసీపీ పాలనలోనే అని పార్లమెంటులో కేంద్రమంత్రే ప్రకటించారని పవన్‌ గుర్తు చేశారు. జగన్‌ దుష్ట పరిపాలనలో నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించిన తరువాత కృష్ణా జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన వారాహి యాత్రలో ఇరుపార్టీల శ్రేణులు కలిసి అడుగులు వేశాయి. కృష్ణా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో పాటు జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్‌లు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. బుధవారం పెడనలో నిర్వహించిన సభకు మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story