PAWAN: యుద్ధానికి మేం సిద్ధం

చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్ర అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి అందరినీ నేరగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వైఖరిని కేంద్ర నాయకత్వం దృష్టికీ తీసుకెళతానని మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన ప్రధాన కార్యదర్శులతో సమావేశం తర్వాత పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు కుట్రలు పన్నారని పవన్ ఆరోపించారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ చంద్రబాబును జైలుకు పంపారన్న పవన్ రేపు అధికారానికి వచ్చిన తర్వాత ఇసుక దోపిడీ దొంగలను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
చంద్రబాబు అరెస్ట్‌తో పరిస్థితిని జగన్ ప్రభుత్వం వేరే స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. వైసీపీ యుద్ధం కోరుకుంటోందని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని పవన్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులు తెలుగుదేశం, జనసేన పార్టీలకు మరింత బలం ఇచ్చాయన్నారు. జగన్ మీరు ఇంత వెంటాడి సాధిస్తే మేం పారిపోమని పవన్ స్పష్టం చేశారు. తాము భయపడమని, మరింత బలపడతామని, మీరు జైలుకు వెళ్లి వచ్చారని, అందరినీ జైలుకు పంపాలనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అక్రమంగా డబ్బులు సంపాదించి రాజ్యాధికారం సంపాదించి అందరినీ నేరగాళ్లుగా చిత్రీకరిస్తామంటే ఎలా? అని నిలదీశారు.
చంద్రబాబుకు కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్న పవన్...అది ఎప్పుడూ ఉంటుందని, పదిసార్లు మాట మార్చేవాణ్ని కానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. పొత్తులపై అదే మాటపై ఉన్నానని, జనసేన బలం బాగా పెరిగిన మాట నిజమని, ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా అది పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేస్‌కు జగన్ ప్రమాదకారి అని, ఆయన్నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే ప్రధాన ఎజెండా అని పవన్ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతామని జగన్ భయపడుతున్నారని, విశాఖలో అంత గొడవ జరిగినప్పుడు చంద్రబాబు మనకు మద్దతు తెలిపారని పవన్ గుర్తు చేశారు. తిరిగి మనం స్పందించడం, నిలబడటం సంస్కారం. జగన్ ఇక్కడ సంపాదించిన డబ్బు దాచుకోవడానికి లండన్ వెళ్లారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆ విషయాలన్నీ బయటకు వస్తాయన్నారు.
జగన్‌ను అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పుతామని, ప్రభుత్వం మారగానే మిమ్మల్ని, మీ అనుచరులను పోలీసుల చుట్టూ.. ఇలాంటి విచారణల చుట్టూ తిరిగేలా చేస్తామని పవన్ హెచ్చరించారు. కోనసీమలో వారాహి యాత్ర సమయంలో 2000 మంది కిరాయి సైన్యాన్ని దింపారని, 50 మందిని చంపెయ్యాలని టార్గెట్ పెట్టారని పవన్ ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com