Pawan Kalyan : నా ఇంటినే అడవిగా మార్చా.. పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్

పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయనీ.. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యంగా ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గ్లోబల్ టైగర్ డే సందర్భంగా సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నల్లమల, శ్రీశైలం నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేసి అడవులను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. పీసీసీఎఫ్ (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.) చిరంజీవి చౌదరికి 'సీక్రెట్ నెట్వర్క్ ఆఫ్ నేచర్' అనే పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ బహూకరించారు.
"ఇక్కడ ఒక విషయం చెప్పాలి... నా చిన్నతనంలో ఒంగోలులో ఉన్నప్పుడు మా వీధిలోకి ఒక పంగోలిన్ ను అందరూ కలిసి కొట్టేశారు. అది ప్రమాదకరమా అని అడిగితే మాకూ తెలియదు.. ఏమైనా చేస్తుందేమోనని భయంతో కొట్టేశామన్నారు. వన్యప్రాణులపై ముందుగా భయంతోనే హాని తలపెడతారు. వన్య ప్రాణి పరిరక్షణ చట్టం, అటవీ పరిరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. నేను రాజకీయ నాయకుడి కంటే ముందు ప్రకృతి సంరక్షకుడిని. నా ఫాం హౌస్ లో నేను ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా సహజంగా పెరిగే మొక్కలు, చెట్లు, కీటకాలు పెరిగేలా చర్యలు తీసుకున్నాను. దీనివల్ల అనేక పక్షులు అక్కడికి వచ్చి చేరాయి. దీని కోసం మనం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. ఉన్నంతలో సంరక్షణ చర్యలు చేపడితే చాలు. హైదరాబాద్ లో నేను ఉండే
1400 చదరపు గజాల ఇంటి ఆవరణలోనూ సహజంగా పెరిగే ఏర్పాటు చేస్తే చిన్నపాటి అడవిలా తయారైంది. ఇప్పుడు అక్కడ అరుదైన పక్షులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయి" అని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో పులుల సంరక్షణ గురించి చెబుతూ నల్లమల అడవుల్లో చెంచులు టైగర్ ట్రాకర్స్ గా ఉన్నారనీ, అక్కడ వన్యప్రాణుల అందించడంతోపాటూ అక్రమాలు జరగకుండా నిఘా ఉంచుతారని చెప్పడం ఆనందం కలిగించిందని చెప్పారు పవన్ కళ్యాణ్. "ఇప్పుడు నేను దేవుని దయతో ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. అంతర్జాతీయ పులుల దినోత్సవాన అధికారులకు మాటిస్తున్నాను. ఇక్కడ ఎంతో నిబద్దత కలిగిన అధికారులు ఉన్నారు. వారికి గుర్తింపు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పారు. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కా రానికి ముందుకు వెళ్లామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అటవీ శాఖకు బడ్జెట్ పెంచే విధంగా, ఉద్యోగుల కొరత భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటా" అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com