Penna River: స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న పెన్నా ఉధృతి..

Penna River (tv5news.in)
Penna River: అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ పొంగి పొర్లుతున్నాయి. పెన్నా కుముద్వతి ప్రాజెక్టుకి వరద ఉధృతి స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ప్రధాన చెరువులైన కోట్నూరు, శ్రీకంఠపురం, సూగూరు నిండి 30 ఏళ్ల తర్వాత మరువ పారుతుంది.
నీటికి కటకటలాడే ప్రాంతంలో చెరువులు నిందుకుండల్ని తలపిస్తుంటే ఓ పక్క సంతోషం ఉన్నా.. చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడం అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. భారీవర్షాలు, వరదలకు లేపాక్షి మండలంలోని లేపాక్షి పెద్ద చెరువు, చోళ సముద్రం చెరువు, సిరివరం చెరువు, కొండూరు చెరువు నిండాయి.
చిలమత్తూరు మండలంలో 50 ఏళ్ల తర్వాత ఎన్నడూ లేని విధంగా ఎగువ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం నుండి వరద నీరు పోటెత్తడంతో చిలమత్తూరులో కుషావతి, చిత్రావతి నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిలమత్తూరు పెద్ద చెరువు, కోడూరు, పలకలపల్లి, మరలపల్లి పాతచామలపల్లిలో చెరువుల్లో నీరు ప్రమాదకరస్థాయికి చేరింది.
అటు, అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చే పంట కళ్ళముందే సర్వనాశనం అయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కజొన్న కంకులు మొలకెత్తాయి. వరి పంట పూర్తిగా నాశనమైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు దీనంగా వేడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com