Eluru: ఎస్‌ఈబీ అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..

Eluru: ఎస్‌ఈబీ అదుపులో ఉన్న వ్యక్తి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..
Eluru: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Eluru: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న SEB పోలీసుల కస్టడీలో వున్న కొల్లూరు దుర్గారావు.. తర్వాత ఏలూరులో రైలు పట్టాలపై శవమై కనిపించడం సంచలనంగా మారింది. బెల్లం అమ్ముతున్నాడనే నెపంతో మూడు రోజుల క్రితం దుర్గారావును జంగారెడ్డిగూడెం SEB టీమ్‌ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది, 60 ఏళ్ల వృద్ధుడి శవం పట్టాలపై ఎలా ప్రత్యక్షమైంది అనేది అనేక సందేహాలకు తావిస్తోంది.

బంధువులైతే SEB వాళ్లే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. శవాన్ని తీసుకు వెళ్లేందుకు నిరాకరించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దుర్గారావు మృతి మిస్టరీగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏలూరు SEB CI అత్యుత్సాహం ప్రదర్శించి మృతుని బంధువులకు తెలియకుండా పోస్టుమార్టం నిర్వహించడం కూడా వివాదాస్పదమైంది.

ఏలూరు నుండి దుర్గారావు శవాన్ని అర్ధరాత్రి ప్రైవేట్ అంబులెన్స్‌లో పొంగుటూరు తీసుకువచ్చి శవాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేశారు. ఐతే.. దుర్గారావు మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోకుండా తాము శవాన్ని తీసుకోబోమని బంధువులు చెప్పడంతో డెడ్‌బాడీ అంబులెన్స్‌లోనే ఉండిపోయింది. దుర్గారావును పోలీసులే హత్య చేసి ఏలూరులో రైలు పట్టాలపై పడేసి కట్టుకథలు అల్లుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బెల్లం అమ్మడం నేరం కాదని, బెల్లం అమ్మకందారులపై కేసులు పెట్టవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ.. సారా తయారీ అరికట్టడం చేతకాని SEB అధికారులు బెల్లం అమ్మకందారులను అదుపులోకి తీసుకుని, వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. ఈ తరహా వేధింపులే ఇప్పుడు దుర్గారావు చావుకు కారణం అయ్యాయంటున్నారు. SEB ఎస్సై, ఇతర అధికారులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story