Tirumala: భక్తులతో కిక్కిరిసిపోతున్న తిరుమల.. ఏప్రిల్, మే నెలల్లో 42 లక్షల మంది దర్శనం..

Tirumala: తిరుమల వేంకటేశ్వరుడు కోట్లాది భక్తులకు కులదైవం. వైకుంఠనాథుని కలియుగ అవతారం. ఎన్నిసార్లు చూసినా తనివితీరని ఆధ్యాత్మిక దాహం. అందుకే, మరొక్కసారి కనులారా చూసేందుకు భక్తులు ఏడాదంతా వస్తూనే ఉంటారు. అలాంటి తిరుమలలో రెండేళ్లుగా పరిమిత దర్శనాలు జరుగుతున్నాయి. ఫస్ట్‌వేవ్‌లో ఏకంగా 80 రోజుల పాటు దర్శనాలే లేవు. ప్రస్తుతం కరోనా భయాలు పోవడం, నిబంధనలు సడలించడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.
రెండేళ్లుగా స్వామివారిని దర్శించుకోలేకపోయిన వాళ్లు తిరునగరికి పయనమవుతున్నారు. పైగా వేసవి సెలవులు, విద్యార్ధులకు పరీక్షలు అయిపోవడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనాలను అనుమతిస్తుండడం, కాలినడకన వచ్చే వారి సంఖ్య కూడా పెరగడంతో.. సప్తగిరులు కిక్కిరిసిపోతున్నాయి. సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉంటే క్యూలైన్లు దాటి కిలో మీటరు పొడవున భక్తుల రద్దీ కనిపించేది.
ఈసారి మాత్రం సర్వదర్శనం క్యూలైన్ నభూతో అన్నట్టుగా ఉంది. లేపాక్షి సర్కిల్ దాటుకుని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా, పాత అన్నదాన సత్రం, రాంభగీచా బస్టాండ్ వరకు క్యూలైన్ పెరిగింది. తిరుమల చరిత్రలోనే ఇంత పెద్ద క్యూలైన్ ఎన్నడూ లేదు. రోజుకు కనీసం 70వేల నుంచి 80వేల మంది స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు, వ్యవసాయ పనులు మొదలయ్యే వరకు తిరుమలలో రద్దీ ఇలాగే ఉండొచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీనివాసుడికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లే భక్తులు ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా ఉన్నారు. రెండేళ్లుగా మొక్కులు చెల్లించుకునే అవకాశం లేకపోవడంతో.. భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. పైగా పరీక్షా ఫలితాలు కూడా వస్తుండడంతో మొక్కుల తీర్చుకునే భక్తులతో రద్దీ విపరీతంగా పెరగనుంది. ఇప్పటికే ఏప్రిల్‌లో 20 లక్షల మంది, మేలో 22 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కానుకలు కూడా గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వస్తున్నాయి.
ఏప్రిల్‌లో హుండీ ఆదాయం 127 కోట్లు, మే నెలలో 123 కోట్ల రూపాయలు వచ్చాయి. హుండీ ఆదాయం కాక వివిధ ట్రస్టులకు భారీగానే మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. ఈ సీజన్‌లో రోజుకు సరాసరిన 4 కోట్లకుపైనే కానుకలను చెల్లించారు. కరోనా అదుపులోకి రావడంతో టిక్కెట్లు లేకుండానే సామాన్య భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. అయితే, భక్తుల రద్దీ కారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో ఎలాంటి సిఫార్సు లేఖలను ఆనుమతించడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com